- ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
- సృజనాత్మకతను వెలికితీసేలా పోటీలు
ప్రజాశక్తి - తిరుపతి సిటి: పిల్లల్లో సృజనాత్మకత, శాస్త్రీయతను వెలికి తీయడమే లక్ష్యంగా తిరుపతిలో శనివారం 'బాలోత్సవం' ప్రారంభ మయ్యింది. ఐదు వేదికల ద్వారా విద్యార్థులకు పలు రకాలైన పోటీలను శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటూ పోటాపోటీగా పాల్గొన్నారు. చిన్నారుల అభినయం ఆహూతులను కట్టిపడేసింది. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథులుగా హాజరై బాలోత్సవాన్ని ప్రారంభించారు. అన్నమయ్య వేదిక ద్వారా జానపద నృత్య ద్రపర్శన, యామిని కృష్ణమూర్తి వేదిక ద్వారా శాస్త్రీయ నృత్య పోటీలు, శంకరంబాడి వేదిక ద్వారా దేశభక్తి గీతాలాపన, పూని నాగేశం వేదిక ద్వారా ఏకపాత్రాభినయం, ప్రధాన వేదికైన చాచా నెహ్రూ వేదికపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రారంభ సభలో ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లోని సృజనాత్మకతను వెలియితీసేందుకు, వారిలోని నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఇలాంటి బాలోత్సవ కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. భావి భారత పౌరులైన విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా తమను తాము అభివృద్ధి చేసుకుంటూ దేశాభివృద్ధికి సహాయ పడాలన్నారు. విలువలతో కూడిన జీవితాలను గడుపుతూ సంఘానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బాలోత్సవం కమిటీ నిరంతరం కృషి చేయడం అభినందనీ యమన్నారు. విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని, శాస్త్రీయ దృక్పథంతో మెలగాలని సూచించారు. సమయం చాలా విలువైనదని, దాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని ఎదగాలన్నారు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్నారు. తన చిన్నతనంలో పాఠశాల జీవితాన్ని నెమరువేసుకున్నారు. బాలోత్సవ నిర్వాహకులు నాగార్జున మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, సమాజంలో బాధ్యత గల పౌరులుగా, వారిలో దేశభక్తి పెంపొందించడం, మూఢనమ్మకాలకు దూరంగా ఉంచేలా ప్రయత్నం చేయడం తిరుపతి బాలోత్సవం ఉద్దేశంగా పనిచేస్తోందని వెల్లడించారు..అనంతరం విద్యార్థులు ఉత్సహంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ జిల్లా గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం , అధ్యక్షులు నడ్డా నారాయణ, కార్యదర్శి రెడ్డెప్ప, కోశాధికారి గురునాధం, మునిరామయ్య, సాకం నాగరాజు, మల్లీశ్వరరావు పాల్గొన్నారు.










