
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉపమాక వెంకన్న కొండపై శుక్రవారం ఉదయం భక్తులపై తేనెటీగలు దాడి చేయడంతో 10 మంది భక్తులు గాయపడ్డారు. కొండపై వున్న ఆలయ ప్రాంగణంలో అర్చకులు హౌమం చేస్తుండగా, హౌ మం పొగకు సమీపంలో వున్న తేనెటీగలు చెదిరి స్వైరవిహారం చేసి అక్కడున్న భక్తులపై దాడి చేశాయి. నక్కపల్లికి చెందిన రేజేటి సింగరాచార్యులు, ఎలమంచిలికి చెందిన శ్రీరంగం శ్రీనివాస్, ఉపమాకకు చెందిన గొట్టుముక్కల భరద్వాజ్ తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కె.మంగామణి, శాయమ్మ, బాలసుబ్రహ్మణ్యం, శ్రీవత్స సహా మరో నలుగురి భక్తులపై తేనేటీగలు దాడి చేయడంతో వీరు కూడా స్వల్పంగా గాయ పడ్డారు. గుంపులు, గుంపులుగా తేనెటీగలు వెంబడించడంతో కొండపై వున్న భక్తులు ప్రాణ భయంతో కిందకు పరుగులు తీశారు. బాధిత కుటుంబ సభ్యులు తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని నక్కపల్లి 50 పడకల ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారులు చికిత్స అందించారు. వీరి పరిస్థితి నిలకడగానే వుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు.