ప్రజాశక్తి - ఆదోని
ఆదోని నియోజకవర్గంలో శనివారం రంజాన్ పండగ సందర్భంగా ఈద్ నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పట్టణంలోని 60 మసీదుల్లో ఈద్ నమాజ్ నిర్వహించినట్లు పట్టణం ఖతిబ్ సాబ్ జునేద్ హాష్మి తెలిపారు. పట్టణంలోని షాహి జామియా మసీదు, పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు వేలాదిమంది ముస్లింలు హాజరయ్యారు. మసీదులో ఖతిబ్ సాబ్ జునేద్ హష్మి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో ముస్లింలు ప్రత్యేకంగా ఎమ్మెల్యేను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులమతాలకు అతీతంగా ఆదోనిలో పండగలు జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును టిడిపి ముస్లిం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. సోదర భావంతో కలిసిమెలిసి జీవించినప్పుడే మతసామరస్యం కాపాడిన వారవుతామని తెలిపారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. చిప్పగిరిలో రంజాన్ పండగ సందర్భంగా బంబం స్వామి దర్గా దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువు ఖాద్రీ ఉపన్యాసం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ముస్లింలు మసీదుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దకడబూరు గ్రామంలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టిడిపి రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం ఇమామ్ రెహమాన్‌కు టిడిపి నాయకులు రమాకాంత్ రెడ్డి, మల్లికార్జున, మీసేవ ఆంజనేయులు, బాబు శాలువా కప్పి సన్మానించారు. దేవనకొండ, తెర్నేకల్, కరివేముల, పి.కోటకొండ, ఎంకె.కొట్టాల, ఐరన్ బండ తదితర గ్రామాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ముస్లింలు గుంపులుగా ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దానధర్మాలు చేశారు. కోసిగి (రూరల్)లో ముస్లింలు రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ముందుగా తమ తమ ఇళ్ల నుంచి, మసీదుల నుంచి ర్యాలీగా బయల్దేరి రైల్వే గేటు పక్కన ఉన్న ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. మత పెద్ద జాకీర్ మౌలానా రంజాన్ గొప్పదనాన్ని వివరించారు. స్థానికంగా ఉన్న జామియా, నూరాని సున్ని, మదీనా, మజీద్ ఏ అక్సా, ఫారుఖి మసీదుల ముస్లింలు వచ్చి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా నుంచి ఇంటికి వెళ్లే సమయంలో మధ్యలో దానధర్మాలు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మంత్రాలయం పాత ఊళ్లో ఉన్న జామీయ మసీదులో పేష్ ఇమామ్ ఖాజా బందేనమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి పురవీధుల గుండా రాఘవేంద్ర సర్కిల్ మీదుగా రాయచూర్ రోడ్డు వైపు ఉన్న ఈద్గా వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలో స్థలం సరిపోక పక్కనే ఉన్న జాతీయ రహదారి 167పై ఎండలో పిల్లలు, పెద్దలు ప్రార్థనలు చేశారు. రంజాన్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం మత పెద్దలు గాజుల బాష, సాబ్ జాన్, నూర్ అహ్మద్, ఫక్రుద్దీన్, ఖాజా హుస్సేన్ తాత, నన్నే సాబ్, పింగాణి ఖాజా, సాబువలీ, అక్బర్ వలీ, బాష, రఫీ, చాంద్ పాల్గొన్నారు. ఆలూరు మండలంలోని ఆలూరు, మొలగవల్లి, హత్తిబెళగల్, హులేబీడు గ్రామాల్లో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ర్యాలీగా వెళ్లి ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోళగుందలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ పండగను జరుపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ర్యాలీగా వెళ్లి ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ పండగను జరుపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ర్యాలీగా వెళ్లి ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.










