Sep 28,2023 23:46

ర్యాలీ చేస్తున్న ముస్లిములు

ప్రజాశక్తి-యంత్రాంగం
కలెక్టరేట్‌ (విశాఖ) : జగత్‌ ప్రవక్త మహమ్మద్‌ రసూలుల్లాV్‌ా సల్లల్లాహు అలైహి వసల్లం జయంతి వేడుకైన ఈద్‌ ఏ మిలాద్‌-ఉన్‌-నబిని ముస్లిం సోదరులు గురువారం నగరంలో ఘనంగా జరుపుకున్నారు. సీరత్‌ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లిములు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పూర్ణా మార్కెట్‌ స్ప్రింగ్‌ రోడ్డులోని రిజర్వులైన్‌ మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్‌ జంక్షన్‌, మహిళా కళాశాల, సెవెన్‌ హిల్స్‌, జగదాంబ జంక్షన్‌ మీదుగా వన్‌టౌన్‌లోని హజ్రత్‌ ఇషాక్‌ మదిని ఔలియా రహితుల్లాలై దర్గా వరకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్‌ జెండాలు చేతబట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లిములు ప్రవక్త సూక్తులను పెద్ద పెట్టున బిగ్గరగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ లతీఫ్‌, వైసిపి నేత ఫారూకి, కార్పొరేటర్లు బర్కత్‌ అలీ, మొహమ్మద్‌ సాధిక్‌, టిడిపి నేత మహమ్మద్‌ నజీర్‌, కాంగ్రెస్‌ నేత హైదర్‌ అలీ సింకా, మెహబూబ్‌ షరీఫ్‌, ఆసిఫ్‌ తదితరులు మాట్లాడుతూ, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్‌ ప్రవక్త మహమ్మద్‌ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారని, ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్‌ మదిని ఔలియా రహమతుల్లా అలై దర్గా ముస్లిం మత గురువులు వద్ద ఫాతిహా నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
యలమంచిలి : మహ్మద్‌ ప్రవక్త జయంతి (మిలాద్‌ ఉన్‌ నబీ) వేడుకలు యలమంచిలి జామియా మిలియా మజ్జీద్‌లో ఘనంగా నిర్వహించారు. మసీదులో ప్రార్దనల అనంతరం మెయిన్‌రోడ్డుపై ప్రవక్త సూక్తులు వల్లిస్తూ సుమారు వంద మంది ముస్లిం సోదరులు ఊరేగింపు జరిపారు. పిల్లలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మసీదు సంఘం అధ్యక్షులు షేక్‌ బాబ్జీ, కార్యదర్శి కన్నాసాహెబ్‌, మెహబూబ్‌, కరంతుల్లా, షేక్‌ దరయా పాల్గొన్నారు.
కశింకోట : మహమ్మద్‌ ప్రవక్త జయంతి వేడుకలు మండలంలోని కశింకోట నూరి మసీదు, అబ్దుల్‌ అజిషా ఖాదరి దర్గాలో, బయ్యవరం ఆన్సర్‌ మదిని ఔలియా దర్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ర్యాలీలు చేపట్టారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎస్‌కె.బాబర్‌, అబ్దుల్‌ కలాం ఆజాద్‌, మౌలానా నసీం, మక్బూల్‌, మౌలానా జాఫర్‌, ఎస్‌కె.బుఖారి, సయ్యద్‌ సలీం, సయ్యద్‌ తాజుద్దీన్‌, అబ్దుల్‌ మజీద్‌, నూర్‌నబి, సయ్యద్‌ రహమతుల్లా, ఎస్‌ఎంఎస్‌ ఆలీ, ఎంఏ రబ్బాని పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని మేజర్‌ పంచాయతీ ఏఎల్‌ పురంలో మహా ప్రవక్త హజ్రత్‌ మహమ్మద్‌ పుట్టినరోజు సందర్భంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మసీదు నుండి ముస్లిం సోదరులు అంబేద్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్‌ ప్రవక్తల జీవిత విశేషాలను మసీదు గురువు కరీం వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.