Feb 04,2022 06:47

సోబెరన్‌! తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓ మాట చెప్పాడు. 'నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది'' అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీదండ్రీ అన్నీ తానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు.

   మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడాల్సిందే!! వస్తువులైనా, మనుషులైనా. కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్నవారిని, పైకి లేచిన వారినీ, పైకి లేచి కింద పడినవారినీ, అందరినీ! ప్రపంచంలోని అన్యాయాన్ని చూస్తూ ఉండకూడదు. అది మన వెలుగుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకోగూడదు, సహించగూడదు. ఆ లక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి !
   ధనవంతుడు సముద్రం లాంటి వాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేడు. సంస్కారవంతుడు బావి లాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్ళతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా'నవ'వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. సరే.. అక్క పెళ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్ళు కష్టపడి, అతి కష్టం మీద ఐదు వేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్‌బుక్‌ ద్వారా కరీంనగర్‌ లోని న్యూ ఎస్టీ కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు. ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప ఉంది. ఆమెకు కాలేయ వ్యాధి-విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచి పెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకుని ఇతరులకు సహాయపడటమే మానవత్వం. ఇలాంటి ఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. బొంబాయి వాసి అమన్‌, రహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుష్యమైన ప్రదేశం... ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్ళాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్ళు వెంటనే స్పందించి, వచ్చి.. పాపను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. తర్వాత బాలల అనాథాశ్రయంలో చేర్పించారు. అబద్ధాలతో సోషల్‌ మీడియాను కలుషితం చేస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి.
   ఇటీవలి కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మానవ వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడటానికి కానీ, అంత్యక్రియలు జరిపించడానికి గానీ అతని బంధుమిత్రులూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్‌ ఉపవాసంలో ఉన్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు. అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి తెలుసుకోవడానికి మన తరంలో సగం జీవితం అయిపోయింది కదా? తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి? మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దానివల్ల సమాజ పురోగతి వేగం పుంజుకుంటుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృధా చేసుకోగూడదు. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. మనోభావాలు దెబ్బతిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో వారెంత మాత్రమూ పట్టించుకోరు.
    2014 అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఉద్యోగం సంపాదించింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్‌ ఆనందంలో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఒక జీవిని, ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్ళలో కనిపించింది. అతి సామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ళ కంటే గొప్పవాడు సోబెరన్‌! అతను తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓ మాట చెప్పాడు. ''నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది'' అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీదండ్రీ అన్నీ తానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ళ క్రితం బండి తోసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్ప మీద ఏడుస్తూ ఒక ఆడశిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక, అవకాశాల్లేక... అవకాశాలివ్వక... ఎన్నో జాతులు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికే వాడికి ఉన్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?
    చాలా మంది సీతాసాహూ అనే మహిళ పేరు విని ఉండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి ఉండొచ్చు. మన మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతాసాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలింపిక్‌ పతకాలు తెచ్చిన మహిళ. జీవిక కోసం ప్రస్తుతం పానీపురీ అమ్ముకుని బతుకుతూ ఉంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్ళూ, చెవులూ రెండూ లేనట్టేనా? కోట్లకు కోట్లు సంపాదించిన ఓ క్రికెట్‌ ఆటగాడి పేరు చెబితే... దేశం యావత్తూ గుర్తుపడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సీతా సాహూ లాంటివారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు ఉండకూడదని! దీనికి జస్టిస్‌ చంద్రచూడ్‌ 2018 ఆగస్టు 30న ఒక మంచి వివరణ ఇచ్చారు. 'ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక 'సేఫ్టీ వాల్వు' లాంటిది. దాన్ని అనుమతించకపోతే, ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్‌ కుక్కర్‌ పేలిపోతుంది!' అని.
    కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కరోనా వ్యాక్సిన్‌లు అందరితో కలిపి కాకుండా, తమ 'అగ్ర వర్ణం' వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్‌ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ 'కులపోడి' రక్తమే కావాలని డిమాండ్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24 లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు తాము ఏ కులానికీ, ఏ మతానికీ చెందమని స్పష్టం చేశారు. ''ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూ ఉందని'' అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి. రవీంద్రనాథ్‌ ప్రకటించారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తోంది. కులం-మతం కాలమ్స్‌ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్‌ సంచలనం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్‌ను అప్లికేషన్లలో ప్రింట్‌ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం !
   నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో ఉంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్ళిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్‌ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలనుకుంటే... మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. 'ఫైవ్‌ మీల్స్‌, టూ సస్పెండెడ్‌' అని అంటుంది. ఐదు భోజనాలకు డబ్బు చెల్లించి, మూడు మాత్రమే తీసుకుంటుంది. ఎవరైనా అతి దీన స్థితిలో ఉండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్ళు వచ్చి అడిగితే... ఆ రెస్టారెంట్‌ వాళ్ళు వారికి భోజనం పెడతారు! 'ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌' అని అడిగిన వారికి ''ఎనీ సస్పెండెడ్‌ కాఫీ'' అని అడిగిన వారికి రెస్టారెంట్‌ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్‌ గౌరవభావంతో డొనేట్‌ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్‌ వాళ్ళూ, పేదలకు అందిస్తారు. మానవీయ విలువలు గల హుందాతనంతో.. అలా ముక్కూ మొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా, మానసికంగా కృంగిపోక - హుందాగా 'ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌' అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై - సస్పెండెడ్‌ కాఫీ, టిఫిన్‌, మీల్స్‌కు డబ్బు చెల్లించాలని ఉబలాటపడతారు కూడా !
    ఈ సమాజంలో ఆర్థిక, సాంఘిక, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదని మానవ జాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజ సేవకులూ కావాలి! 'సేవ' అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమాజాన్ని పాత రాతి యుగంలోకి ఈడ్చుకుపోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా.
 

/ వ్యాసకర్త: సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త /
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు