Nov 17,2023 21:42

భిక్షం అడుక్కుంటున్న పంచాయతీ కార్మికులు

           ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌  పంచాయతీ పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారడంతో చేసేది లేక భిక్షమెత్తారు. అయినా అటు ప్రభుత్వానికిగానీ, ఇటు అధికారులకుగానీ వేతనాలు చెల్లిద్దామన్న ఆలోచన రాకపోవడం బాధాకరమని కార్మికులు వాపోతున్నారు. మండలంలోని గన్నెవారిపల్లి పంచాయతీలో పని చేస్తున్న 40 మంది పంచాయతీ పారిశుధ్య కార్మికులు వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం పంచాయతీ పరిధిలోని కడప రోడ్డులో దుకాణాల వద్ద భిక్షమెత్తి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు కార్మికులు మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా అప్పులు చేసి కుటుంబాలు పోషించుకున్నామన్నారు. ప్రస్తుతం అప్పులు ఇచ్చే వారు కూడా ఉన్నారన్నారు. చేసేది లేక భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, హనుమంతురెడ్డి, రామంజి, పంచాయితీ కార్మికులు రాజు, రామకృష్ణ, సంధ్యాబాయి, కుళ్లాయప్ప, అచ్చమ్మభాయి, తదితరులు పాల్గొన్నారు.