ప్రజాశక్తి-చింతూరు
పేద ప్రజల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ అసువులు బాసిన సిపిఎం నేత, అమరజీవి కామ్రేడ్ బత్తుల భీష్మారావు ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. భీష్మారావు 37వ వర్థంతి శనివారం శ్యామల వెంకటరెడ్డి స్మారక భవనం వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత భీష్మారావు చిత్రపటానికి ఆయన సతీమణి, తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శి బత్తుల హైమావతి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏజెన్సీలో కార్మికుల కష్టాన్ని దోచుకునే వారిపై ఎదురు తిరిగి ప్రశ్నించి గిట్టుబాటు కూలి సాధించడంలో కామ్రేడ్ భీష్మారావు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. భీష్మారావు ప్రజల మనిషిగా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ నాటి పీపుల్స్ వార్ నక్సల్స్ 1985 నవంబర్ 5న విఆర్ పురం మండలం జీడిపప్పు నుండి వస్తుండగా హత్య చేశారని తెలిపారు. భీష్మారావు సతీమణి బత్తుల హైమావతి మాట్లాడుతూ నక్సల్స్ నాయకులను అయితే హతమార్చారేగాని వారి ఆశయాలను ఏమీ చేయలేకపోయారని, వారి ఆశయ సాధన కోసం నాటి నుండి నేటి వరకు ఎంతోమంది ప్రజా పోరాట ఉద్యమ బాటలో నడుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కుంజ సీతారామయ్య, మండల కార్యదర్శి సీసం సురేష్, ఎంపీటీసీ వేక రాజ్ కుమార్, ముర్రం లక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్, ఐద్వా నాయకురాలు ముర్రం రంగమ్మ, పోడియం లక్ష్మణ్, సవలం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
విఆర్.పురం : కామ్రేడ్ బత్తుల భీష్మారావు వర్థంతి సభ రేఖపల్లిలోని బొప్పిన భీమయ్య భవనంలో నిర్వహించారు. ముందుగా భీష్మారావు చిత్ర పటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీలో అనేక ప్రజాతంత్ర ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తి భీష్మారావు అని కొనియాడారు. ఆయన ఉద్యమ స్ఫూర్తితో రానున్న కాలంలో మండలంలో సిపిఎంను గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు, నాల్లారపు ప్రకాశరావు, కొమ్మల వెంకటరమణ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎటపాక : ప్రజా ఉద్యమాల ద్వారా సీపీఎంకు పూర్వ వైభవం తీసుకురావడమే కామ్రేడ్ భీష్మారావు నిజమైన నివాళి అని సిపిఎం మండల కార్యదర్శి ఐవి అన్నారు. ఎర్రబోరు పార్టీ కార్యాలయంలో భీష్మారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐవి మాట్లాడుతూ భీష్మారావు లాంటి వారి త్యాగాల పునాదుల మీద సిపిఎం ప్రజా ఉద్యమాలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డేగల మాధవరావు, కాకా అర్జున్, ఐ పద్మ, పులుసు బాలకృష్ణ, నూతలపాటి సుధాకర్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.










