Mar 27,2023 20:31

పెట్రోల్‌ బంక్‌ ప్రారంభిస్తున్న ఏం పీ, ఎమ్మెల్యే

భీమవరంలో నూతన పెట్రోల్‌ బంక్‌
- ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

     నందాయల మండలంలోని భీమవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, ఎంపీ పొచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్‌ బాషాలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార కేంద్ర బ్యాంకులు రైతులకే కాకుండా మహిళా పొదుపు సంఘాలకు, చిన్న వ్యాపారస్తులకు, పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నారని తెలిపారు. సహకార కేంద్ర బ్యాంకులు అందిస్తున్న వివిధ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పోలూరు గ్రామంలో కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయాన్ని, యాలూరులో రైతులకు కమ్యూనిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సహకార బ్యాంకు అధికారులు మాట్లాడుతూ పోలూరు సహకార సంఘం పరిధిలో 21 గ్రామాలు వ్యాపారాలు సాగిస్తున్నాయని తెలిపారు. 2005 సంవత్సరం నుండి మిట్నాల, భీమవరం, చాపి రేవుల సంఘాలను పోలూరు సంఘంలో విలీనం చేశామన్నారు. పోలూరులో కార్యాలయాన్ని, గోదాము, పాండురంగాపురంలో 100 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌ ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా సంఘం సభ్యులకు ఫర్టిలైజర్స్‌ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డి, ఎంపిపి శెట్టి ప్రభాకర్‌, కెడిసిసి బ్యాంక్‌ చైర్‌ పర్సన్‌ మల్లెల ఝాన్సీ, బ్యాంకు ఎండిలు, అధికారులు, భీమవరం వైసిపి నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, సర్పంచి, నాయకులు పాల్గొన్నారు.