Jun 06,2023 23:42

నమ్మివానిపేట డంపింగ్‌యార్డును పరిశీలిస్తున్న జివిఎంసి కమిషనర్‌ సాయికాంత్‌వర్మ

ప్రజాశక్తి- భీమునిపట్నం : జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ మంగళవారం 1, 2, 3 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఒకటో వార్డు పరిధి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, దివీస్‌ పార్కు వద్ద రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రధాన కాల్వలో పూడిక తీసి, శుభ్ర పరచాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బి.మహాలక్ష్మి నాయుడును ఆదేశించారు. రోడ్డుకిరువైపులా ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థలు, వ్యక్తులకు సంబంధించి గోడలపై వ్యాపార ప్రకటనలు ఉండడాన్ని ఆయన గుర్తించి వెంటనే వాటిని తొలగించాలని, సంబందిత ప్రకటనల యాజమానుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండో వార్డు పరిధిలోని డంపింగ్‌ యార్డును పరిశీలించారు. సేంద్రీయ ఎరువుల విధానాన్ని పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించాలని శానిటరీ సూపర్‌వైజర్లను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంబడి శుభ్రత లేకపోవడాన్ని గుర్తించి శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రామును ఆదేశించారు. అదే వార్డు గొల్లలపాలెం విఎంఆర్‌డిఎ ఇండోర్‌ స్టేడియాన్ని, మూడో వార్డు పరిధిలో ఉన్న మినీ క్రికెట్‌ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. విద్యుత్‌, మరుగుదొడ్లు, వాకింగ్‌ ట్రాక్‌, తాగు నీరు, ప్రహరీ నిర్మాణం తది తర మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక క్రీడాకారులు కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇందుకు అవసరమైన అంచనాలు రూ పొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం యూజర్‌ చార్జీల వసూలుకు సంబందించి ప్రత్యేక డ్రైవ్‌పై దృష్టిపెట్టాలని శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బి.మహాలక్ష్మినాయుడు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.