ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక మెయిన్ రోడ్డు, ఇతరత్రా రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డు, గంట స్తంభం, బీచ్ రోడ్డు, తగరపువలస రోడ్లను శనివారం ఆయన పరిశీలించారు. భీమిలి ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడాన్ని గుర్తించిన ఆయన, సంబంధిత రోడ్డు విస్తరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. కనీసం 40 నుంచి 60 అడుగుల మేర రోడ్డు విస్తరణకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. స్థానిక మార్కెట్‌ను ఆధునికీకరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. పరిసరాల్లో పలు చోట్ల వ్యర్థాలు, చెత్త పోగులు కనిపించడంతో పారిశుధ్యంపై అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.మహాలక్ష్మినాయుడు ను ఆదేశించారు. పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, మురుగు కాల్వలను ప్రతి రోజూ శుభ్ర పరచాలని, ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంసన్ రాజు, పట్టణ ప్రణాళిక విభాగం ఎసిపి శ్రీనివాస్, స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీర్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు, వైసిపి నియోజక వర్గ ఇంఛార్జి ముత్తంశెట్టి మహేష్, మూడో వార్డు ఇంఛార్జి మైలపల్లి షణ్ముఖరావు, వార్డు అధ్యక్షులు అల్లిపిల్లి నరసింగరావు, మాజీ కౌన్సిలర్ మైలపల్లి లక్ష్మణరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు.










