తొలగించిన ఓట్ల వివరాలపై ర్యాండమ్ పరిశీలన
ప్రజాశక్తి - భీమడోలు
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తొలగించిన ఓట్ల వివరాల ర్యాండమ్ పరిశీలన కోసం మండలంలో బుధవారం పర్యటించినట్లు ఏలూరు ఆర్‌డిఒ పెంచల కిషోర్ తెలిపారు. తొలుత ఆయన భీమడోలు తహశీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం తొలగించిన ఓట్ల వివరాల ర్యాండమ్ పరిశీలనలో భాగంగా భీమడోలు మండలంలోని కొన్ని ఇళ్లను సందర్శించారు. తొలగించిన ఓట్ల వివరాలు గురించి గృహస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 9500 ఓట్లను ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా తొలగించారన్నారు. వీటిలో అధిక శాతం పేర్లు చనిపోయిన వారివే అన్నారు. వీరి వివరాలు అప్పట్లో కరోనా, ఇతర కారణాల వల్ల పూర్తిస్థాయి తొలగింపునకు అవకాశం లేకపోయిందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను ఆధార్‌తో లింక్ చేయటం వల్ల పూర్తిస్థాయి వివరాలు వెలికి వచ్చాయన్నారు. ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాండమ్ చెకింగ్‌లో భాగంగా నియోజకవర్గంలోని వెయ్యి ఓట్ల తొలగింపుపై ర్యాండమ్ పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహశీల్దార్ ఎం.ఇందిరాగాంధీ, డిప్యూటీ తహశీల్దార్ షేక్ షంషుద్దీన్, ఆర్‌ఐ కిరణ్ కుమారి పాల్గొన్నారు.










