ప్రజాశక్తి - భీమడోలు
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు సాధనకు జాతీయస్థాయిలో నామినేట్ అయిన భీమడోలు గ్రామపంచాయతీని ఆ శాఖకు చెందిన థర్డ్ పార్టీ విభాగం గురువారం సందర్శించిందని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ విభాగం తరుపున తనిఖీ అధికారిగా హిస్పోసిస్ హాజరు కాగా, జిల్లా యంత్రాంగం తరపున జిల్లా పంచాయతీ అధికారితో పాటు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా సమన్వయకర్త శిరీష పాల్గొన్నారు. వీరికి భీమడోలు పంచాయతీ విస్తరణ అధికారి ముత్తయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్.ఠాగూర్, డిఎల్‌పిఒ కెపి చంద్రశేఖర్ సహకరించారు. ఈ సందర్భంగా మురుగునీటి పారుదల వ్యవస్థ, పారిశుధ్య పరిరక్షణ, మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి వారు సహకరిస్తున్న తీరు దీని నిర్వహణకు గ్రామపంచాయతీ చేపట్టిన చర్యలు, ఇతర విభాగాల పనితీరును వారికి కేటాయించిన అంశాల వారీగా పరిశీలించారు. భీమడోలు నెంబర్ వన్ ప్రాథమిక పాఠశాలలో సదరు బృందం విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ విభాగంలోని అంశాల వారీగా విద్యార్థులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు జడ్‌పిటిసి తుమ్మగుంట భవాని, గ్రామ సర్పంచి పి.సునీత, స్వచ్ఛంద సంస్థ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్ పి.మాన్సింగ్, వైసిపి ప్రముఖులు రామకుర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.










