Jun 29,2023 20:01

మాట్లాడుతున్న మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఉత్తరప్రదేశ్‌లోని భీమ్‌ ఆర్మీ చీఫ్‌పై దుండగులు కాల్పులు జరపడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు సి.రంగయ్య, జిల్లా నాయకులు మల్లేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మతోన్మాదం బుసలు కొడుతున్న ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, కుల అణచివేతను వ్యతిరేకించేందుకు 2015లో భీమ్‌ ఆర్మీని స్థాపించినట్లు తెలిపారు. ఈ సంస్థకు నాయకుడైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ అనతికాలంలోనే దళితులను, బహుజనులను సంఘటిత పరిచి ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యర్థిగా మారారని తెలిపారు. అధికార బిజెపి తప్పుడు కేసులు బనాయించి జైలులో నిర్బంధినప్పటికీ వెన్నుచూపని ధైర్యం అతనిదని చెప్పారు. ఆజాద్‌పై జరిపిన కాల్పుల వెనుక అధికార పార్టీల హస్తం ఉంటుందన్నారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌ను చంపితే వేలమంది చంద్రశేఖర్‌ ఆజాద్‌లు పుట్టుకొస్తారని హెచ్చరించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌కు జరగరానిది ఏమైనా జరిగితే ఆపై జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దోషులను పట్టుకోవడంలో, న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ధర్నాలు, రాస్తారోకోలతో దేశం అట్టుడుకుతుందని తెలిపారు. ఈ దాడిపై కార్యాచరణకు చర్చకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయకుల నుంచి ఆహ్వానం అందిందని చెప్పారు. కార్యాచరణ మేరకే ముందుకెళ్తామని తెలిపారు. వివిధ గ్రామాల మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.