
తాను ఏ సినిమా తీసినా అందులో సామాజికపరమైన అంశాలు ఖచ్చితంగా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటాయని ప్రముఖ సినీ దర్శకులు అనిల్ రావిపూడి చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారంనాడు 'భగవంత్ కేసరి' చిత్ర యూనిట్ బృందం విజయోత్సవ యాత్రలో భాగంగా బసచేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి మాట్లాడారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల కీలక పాత్ర పోషించారు. భగవంత్ కేసరి దసరా కానుకగా ఈనెల 19న విడుదలైన విషయం తెలిసిందే. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ హీరో బాలకృష్ణ సినీరంగంలో చేసిన సినిమాలకు భిన్నంగా భగవంత్ కేసరి సినిమా చేశారు. మిగతా సినిమాలతో పోలిస్తే బాలయ్య సినిమాల్లో డ్యాన్సులు ఉంటాయి. ఈ సినిమాలో దానికి ప్రాధాన్యత తగ్గించాము. మహిళా సమస్యలు, వారి సాధికారిత వంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాం. తద్వారా ఈ సినిమాలో డ్యాన్సులకు ప్రాధాన్యత తగ్గించాం. మా సినిమాలో ఇచ్చిన 'గుడ్ టచ్..బ్యాడ్ టచ్'లపై ఇచ్చిన సందేశం నేడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతోంది. పోలీసులు, ఉపాధ్యాయులు,ఇతర సామాజిక వ్యక్తులు ఈ సందేశాన్ని లక్షలాదిమందికి పంపిస్తుండటం మాకు ఎంతో సంతోషం కల్గుతోంది. నేను చేసిన ఏడో సినిమా భగవంత్ కేసరి. మిగతా ఆరు సినిమాల్లో పటాస్, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్2, ఎఫ్3, రాజాది గ్రేట్, సుప్రీం వంటి సినిమాల్లో కూడా ఏదో ఒక సామాజిక సందేశం వచ్చేలా చేశాం. భగవంత్ కేసరి సినిమాను కూడా ఇలాంటి సందేశాత్మకంగా తీశాం. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ యాత్రలు నిర్వహిస్తున్నాం. ఈ సినిమాను మరింత మంది బాగా ఆదరించాలని కోరుతున్నాం. ప్రపంచం నలుమూలల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. మంచి కుటుంబ, సందేశాత్మక చిత్రం తీశారని అభినందనల వెల్లువలు వస్తున్నాయి. మాకు చాలా గర్వంగా ఉంది.

- నా కెరీర్‌లోనే అద్భుత చిత్రం : హీరోయిన్ శ్రీ లీల
భగవంత్ కేసరి కథ నాకు చాలా నచ్చింది కాబట్టే చేశాను. ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు ఆడపిల్లలకు మంచి చెబుతుంటారు. సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటి భారి నుంచి ఆడపిల్లలు ఎలా రక్షించుకోవాలే ఈ సినిమా ద్వారా దర్శకులు అనిల్ రావిపూడి చెప్పారు. బాలకృష్ణ లాంటి పెద్ద హీరోతో కలిసి పనిచేయటం చాలా హుందాగా అనిపించింది. ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం వున్న సినిమా ఇది. నా నటనను మరింత మెరుగుపర్చుకునేందుకు దోహదపడిన సినిమా ఇది. శ్రీలీల అనగానే ప్రేక్షకుల మనసులో డ్యాన్స్ అనే ముద్రపడిపోయింది. ఇది చాలా పాజిటివ్ అయినప్పటికీ ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవటానికి దోహదపడింది. బాలకృష్ణను మొదటిసారి కలిసినప్పుడు భయంగా అనిపించింది. ఆ మరుక్షణమే ఆ భయం పోయింది. నిజంగా ఆయనకి యాప్ట్ పేరు పెట్టారు. ఆయనది పసి మనసు. చాలా స్వీట్. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో నన్ను చాలా డిఫరెంట్‌గా చూపించారు. ఇందులో నేను చేసిన విజ్జి పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేలా చేశారు. విజ్జి పాప భయపడే అమ్మాయి. అదే సమయంలో చలాకీగా వుంటుంది. 'ఆడ పిల్ల లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా వుండాలనే ఓ డైలాగ్ మీరు చూసే ఉంటారు. ప్రేక్షకులు సరిగ్గా అర్ధం చేసుకోవాలనే తపనతో ఆ పాత్రల్లో లీలమైన పనిచేశాను. ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య అనుబంధం, ప్రేమ వంటి బంధాన్ని చాలా హుందాగా చూపించారు. అనిల్ రావిపూడి అద్భుతంగా తీశారు. నా రియల్ లైఫ్ చిచ్చా మా అమ్మ. తను చిన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండమని చిచ్చా లానే చెప్పేది. అందుకే ఈ కథతో చాలా కనెక్ట్ అయిపోయాను.
- ప్రజల ఆదరణ బాగుంది : ప్రొడ్యూసర్లు సాహు గారపాటి, హరీష్ పెద్ది
భగవంత్ కేసరి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. సరికొత్త కథ, సందేశాత్మకంగా ఈ సినిమాను తీశాం. కొత్తదనాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. రాబోయేకాలంలో మంచి సినిమాలు తీయటానికి ఈ ఉత్సాహం దోహదపడుతుంది. దేశ విదేశాల నుంచి మంచి సినిమా తీశారని అభినందిస్తున్నారు.
- నాకు అవకాశం కల్పించటం గర్వంగా ఉంది : సినీనటుడు మురళి
భగవంత్ కేసరి సినిమాలో నాకు అవకాశం ఇవ్వటం, ప్రేక్షకులు ఆదరించటం ఎంతో గర్వంగా ఉంది. దర్శకులు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఆయనకు ధన్యవాదాలు.

- ధీరత్వ మహిళలకు ఈ సినిమా అంకితం : శ్రీనివాస్
భగవంత్ కేసరి సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషించాను. నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు. ఈ కథని ఎంచుకోవడానికి కారణం ఇదే. 'భగవంత్ కేసరి' కాన్సప్ట్ నాకు చాలా నచ్చింది. ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో వుంది. ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి. అలాంటి ఓ గొప్ప సినిమాలో భాగం కావడం ఆనందం వుంది. సమాజపరంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన, అధిరోహించటానికి కృషిచేస్తున్న మహిళలందరికీ ఈ సినిమా అంకితం చేస్తున్నాం.