
భారత స్వాతంత్య్రోద్యమంలో భగత్‌సింగ్ ఒక అగ్గిరవ్వ. ప్రపంచంలో చేగువేరాలా మన దేశంలో భగత్‌సింగ్ విప్లవానికి ఓ చిహ్నం. కొందరు భగత్‌సింగ్‌నూ ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా చూస్తున్నారు.. కానీ నేడు మన దేశంలో ఇటీవల జరిగిన విద్యార్థి ఉద్యమాలను చూసినా.. వివిధ సందర్భాల్లో నాయకత్వ పాత్ర చూసినా.. భగత్‌సింగ్ స్ఫూర్తిని కొనసాగించారనే చెప్పాలి. భగత్‌సింగ్ యువతీ యువకులకు సాహసంలో, పోరాటంలో, స్నేహంలో, అధ్యయనంలో స్ఫూర్తిప్రదాత. ఆ స్ఫూర్తితోనే నేటి యువతరం సమాజంలో ఎదుర్కొంటున్న అసమానతలపై, మతోన్మాదంపై, కార్పొరేటీకరణపై పోరాడుతున్నారు. ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ భగత్‌సింగ్ కోరుకున్న సమసమాజ సాధనకు కంకణబద్ధులు కావాల్సిన ఆవశ్యకత మనందరిపైనా ఉంది.
మన దేశంలో అర్ధరాత్రి యూనివర్శిటీ క్యాంపస్‌లపై దాడులు జరుగుతున్నాయి. హత్యాచారాలకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. రైతు పోరాటాలపై రాళ్ళు రువ్వుతున్నారు. మతం పేరుతో ప్రజల్ని విడగొడుతున్నారు. విద్యాలయాల్లో పట్టపగలే ప్రజాస్వామిక వాతావరణాన్ని భగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకులను అణిచేస్తున్నారు. న్యాయబద్ధంగా పోరాడేవారిపై దేశద్రోహం కేసులు పెడుతు న్నారు. భగత్‌సింగ్‌కు కాషాయరంగు పులమాలని ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే, మతోన్మాదులకు కనీసం భగత్‌సింగ్ పేరు పలికే హక్కు ఉందా? ఆయన ప్రజలను బ్రిటీషు నియంతపాలన నుండి విముక్తి చేసేందుకు పోరాడారు. భూమిపై అందరికీ హక్కు కావాలని కోరారు. రైతులను రుణగ్రస్థత నుండి బయటపడేయాలని అన్నారు. ప్రతి మనిషికీ ఇల్లు ఉండాలని, పరిశ్రమలను జాతీయం చేయాలని ఆకాంక్షించారు. అందరికీ విద్య (సార్వత్రిక విద్య) అందాలని, కార్మికుల పనిదినాలు తగ్గించాలని ఆయన కోరారు. ఇవన్నీ చేయగలిగిన వారే భగత్‌సింగ్ అసలైన వారసులు.

''విద్యార్థులు దృఢంగా ఆత్మ విశ్వాసంతో పోరాడాలి!'' అని పంజాబ్ విద్యార్థి మహాసభలో విద్యార్థులకు భగత్‌సింగ్ ఇచ్చిన కర్తవ్యం. భగత్‌సింగ్ స్వాతంత్య్రోద్యమంలో ముందు పీఠిన నిలబడి, ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ స్ఫూర్తితో ప్రస్తుతం దేశ చరిత్రలో క్లిష్టతరమైన సమయంలో యువత భుజాలపై మహత్తరమైన బాధ్యతను తీసుకోవాలి. ''పారిశ్రామిక ప్రాంతాల్లో, మురికివాడల్లో, పల్లెసీమల్లో, దయనీయస్థితిలో బతుకులు ఈడ్చే కోటానుకోట్ల ప్రజాబాహుళ్యాన్ని ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలి!'' అని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొని నాటి నుండి నేటి వరకూ ఎస్‌ఎఫ్‌ఐ కర్తవ్య నిర్వాహణలో నిమగమైంది. అందులో భాగంగానే విద్యార్థులను చైతన్యపరిచే పనిలో ఉంది. నేడు ఆ స్ఫూర్తిని అందుకుని, జెఎన్‌యు, జామియా మిలియా విద్యార్థులు, ఆర్య రాజేంద్రన్ భగత్‌సింగ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
'ప్రతి దాడికీ చర్చలతోనే సమాధానం..!'
తోలుబొమ్మ విసితో మతోన్మాద భావజాలాన్ని విద్యా ర్థులపై రుద్దే ప్రయత్నం చేస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా జెఎన్‌యులో విద్యార్థుల పోరాటాలు ప్రారంభించారు. యూనివర్శిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఐషీ ఘోష్ ఈ పోరాటాల్లో ముందుపీఠిన నిలబడ్డారు. దీనిని సహించలేని నాటి బ్రిటీషు వారికి మోకరిల్లిన అనాగరిక పాలకులు దాడులతో ఉద్యమాలు అణిచేయాలని కుట్ర పన్నారు. ఎంతైనా భగత్‌సింగ్ వారసురాలు కదా! నాడు భగత్‌సింగ్‌ను ఉరితీస్తే ఉద్య మాలు నిలువరించవచ్చు అనుకొ న్నారు. కానీ బ్రిటీషు పాలకులకు బతికున్న భగత్‌సింగ్ కన్నా చనిపోయిన భగత్‌సింగ్ మరింత ప్రమాదకారి అని హెచ్చరించారు. అది ఎంత నిజమో ఐషీ ఘోష్ నిరూపించారు. ఈనాటి బిజెపి పాలకు లనూ ఆమె హెచ్చరిం చారు. ''మీ ప్రతి దాడికీ మా చర్చల ద్వారానే సమాధానం ఇస్తాం!'' అని ఆమె అన్నారు. ఆ భగత్‌సింగ్ స్ఫూర్తితోనే పోరాడతామని నేటి తరం వారసులు చాటిచెప్పారు.
మతతత్వంపై పోరాటం..
''మతం అనేది స్వీయ జీవితానికి సంబంధించింది. మతతత్వం మన శత్రువు, దాన్ని పోరాడి పారద్రోలాలి'' అని 1927 ఏప్రిల్‌లో జరిగిన జలియాన్ వాలాబాగ్ యువజన మహాసభ పిలుపునిచ్చింది. ఆ కర్తవ్యాన్ని అందిపుచ్చుకున్న జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బిజెపి తలపెట్టిన విభజన కుట్రను తిప్పికొట్టారు. మతం పేరుతో ప్రజలను విభజించేందుకు చేసిన సిఎఎ, ఎన్‌ఆర్‌సి రెండు చట్టాలకూ వ్యతిరేకంగా పోరాటానికి జామియా విద్యార్థులే ముందడుగేశారు. పోరాటాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిన మూకలు వారిపౖౖె పిరికిగా అర్ధరాత్రి తుపాకులతో దాడి చేశారు. కాపాడాల్సిన పోలీసులు యూనివర్శిటీ గదుల్లోకి వచ్చి విద్యార్థులపైనే దాడులు చేశారు. ఆనాడు బ్రిటీషు ఉరిశిక్షల భయంకర ఛాయల్లో భగత్‌సింగ్ అమానుష హత్య జరిగితే ఈనాటి బిజెపి ప్రభుత్వం విద్యార్థులపై దేశద్రోహం కేసులు పెట్టింది. బ్రిటిష్ నియంత్రృత్వ విధానాలనే బిజెపి నాయకత్వం పుణికిపుచ్చుకుంది. భగత్‌సింగ్ ఆశయ వారసులైన నేటి విద్యార్థులు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తున్నారు.
ప్రజాప్రతినిధులుగా..
జలియన్ వాలాబాగ్ ఘటనకు చలించి, తుపాకులను నాటి, బ్రిటీషు వారిపై ఎక్కుపెట్టాలని, వారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని చిన్నప్పుడే స్వాతంత్య్ర కాంక్షను బలంగా మనసులో నాటుకున్నారు భగత్‌సింగ్. 14 ఏళ్ళ వయసులో స్కూళ్ల బహిష్కరణ కార్యక్రమాలు చేశారు. అయన స్ఫూర్తితో కేరళలో ఆర్య రాజేంద్రన్ చిన్నప్పటి నుండి పోరాడే కుటుంబంలో పుట్టి, బాలల సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై పోరాడారు. నేడు దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన మేయరుగా గుర్తింపు పొందారు. భగత్‌సింగ్ కోరిన సమసమాజ స్థాపన కోసం, శ్రామికవర్గ పాలన కోసం ఆమె కృషి చేస్తున్నారు.

ధైర్యసాహసాలు..
ప్రశ్నించే గొంతులపై కులం, మతం, జాతీయవాదం, దేశద్రోహం పేరుతో పగపట్టడం లేదా హతమార్చడం వంటి చర్యలకు పూనుకుంటున్న ఘటనలు విదితమే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 2016లో నెలకొన్న అలజడిని గుర్తించి, శాంతింపజేయడానికి ఏమిచేయాలో ఆలోచించలేదు. పైగా హిందూత్వ ముసుగులో కుల, మత మంటలను ఎగదోశారు. ఆ ఉన్మాద మంటల్లో రోహిత్ వేముల ఆహుతయ్యారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేములని ఆదర్శంగా తీసుకుంటానని చెప్పిన జెఎన్‌యు విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్‌ను కటకటాలకు పంపింది ప్రభుత్వం. జాతి వ్యతిరేకులని నిందలు మోపింది. అయినా తాను భరతమాత బిడ్డనేనని, జాతి వ్యతిరేకిని కాదని నిరూపించేందుకు కన్హయ్యకుమార్ వెనకడుగు వేయలేదు. దేశద్రోహం కేసులతో విద్యార్థుల గొంతులు నొక్కలేరని తన పోరాటపటిమతో ఆయన తెలియజెప్పారు. ఇదే యువతరంలో భగత్‌సింగ్ కోరుకున్న దైర్యసాహసాలు. ఇలాంటి యువతరం భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. ఆయన వారసులుగా వెనకడుగు వేయకుండా సమసమాజ స్థాపనకు ముందడుగు వేస్తుంది.

ప్రేమంటే..
శ్రీ శ్రీ చెప్పినట్లు కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు. ఆ కోవకు చెందినవారే పైన పేర్కొన్న వారంతా. ఇంకొంతమంది ఈ రోజు మీడియా, అంతర్జాల ప్రభావంతో ప్రేమ పేరుతో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమపై అప్పట్లోనే భగత్‌సింగ్‌కు ఎంతో స్పష్టత ఉంది. ''ప్రేమను ఎవరూ సృష్టించలేరు. దానంతటదే వస్తుంది. ఎప్పుడొస్తుందో కూడా ఎవరూ చెప్పలేరు. అది సహజంగా వారే ఆవేశపు స్థాయిని అదిగమించి, విశుద్ధతను కాపాడుకోగలుగుతారు!'' అని భగత్‌సింగ్ ప్రేమ గురించి నిర్వచించారు. కానీ నేటితరం ప్రేమ పేరుతో దాడులకు పూనుకుంటోంది. మహిళలపై హత్యాచారాలకు తెగబడుతోంది. ప్రస్తుతం యోగి నాయకత్వంలోని యుపి వీటన్నింటికీ కేంద్రంగా ఉంది. బిజెపి ప్రభుత్వం రేపిస్టులకు మద్దతు పలుకుతూ ర్యాలీలు జరుపుతోంది. మరోవైపు కొందరు యువకులు ఈ దారుణాలను ఖండిస్తూ, యువతలో ప్రభుత్వ దురుద్దేశాలపై అవగాహన కలిగిస్తోంది. యువతుల పట్ల స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో చైతన్యం కలిగిస్తోంది.
నేటి మతోన్మాద ప్రభుత్వం విద్యా రంగం, స్టీల్‌ప్లాంట్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ వంటి ప్రభుత్వరంగ సంస్థల నుంచి భూమి, నీరు వరకూ అన్ని వనరులనూ కార్పొరేట్లకు అమ్మే విధానాల్ని వేగవంతంగా అమలుచేస్తోంది. న్యాయం తరఫున, ప్రజలవైపున నిలిచేవారే భగత్‌సింగ్‌కు అసలైన వారసులు. వీరంతా కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పోరాటాల్లో భాగస్వాములు అవుతున్నారు. లాఠీ దెబ్బలకు వెరవక, దాడులు, కేసులకు భయపడకుండా భగత్‌సింగ్ ఆశయాన్ని అందిపుచ్చుకుని, దేశ సమగ్రతను కాపాడేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ ఉద్యమంలో ఒక జెఎన్‌యు, ఒక జామియా, రైతు సమాఖ్య, కార్మికులు ఐక్యంగా కదులుతున్నారు. వీరే భగత్‌సింగ్‌కు అసలైన వారసులు.
జోర్స్ సే బోలో అజాదీ.. దేశ్ కే బోలో అజాదీ..
* కె.ప్రసన్న కుమార్, 7396503105 (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు)