ప్రజాశక్తి - నెల్లిమర్ల : భగత్ సింగ్ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక అమర వీరుల స్మారక భవనంలో భగత్ సింగ్ 116వ జయంతి వేడుకలు సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు కిల్లంపల్లి రామారావు, టి. సన్ని బాబు, మొయిద పాపా రావు, కాళ్ళ అప్పల సూరి భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
చీపురుపల్లి: ఆశయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామాజంనేయ కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో విప్లవ వీరుడు స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్ 117 జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ భగత్ సింగ్ చిత్రపటాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె.గోపి, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. విప్లవవీరుడు భగత్ సింగ్ 116వ జయంతిని జనసేన కార్యాలయంలో గురువారం నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అడబాల వెంకటేష్ నాయుడు, వజ్రపు నవీన్ కుమార్ , ఎమ్ .పవన్ కుమార్ , పృథ్వీ భార్గవ్, హిమంత్, కంకిపాటిరాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.










