Mar 21,2021 13:21

జైలు గోడల మధ్య భగత్‌సింగ్‌ సాహిత్యాధ్యయనం విస్తృతంగా సాగించాడు. అందులో ప్రత్యేకించి స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి, ఒంటరితనం గురించి, బందీగా ఉండటం గురించి పలు చరణాలు ఎత్తి రాసుకున్నారు. ఇవి ఆయన స్వేచ్ఛాప్రియత్వాన్నీ.. అదే సమయంలో మానసికంగా జైలు జీవిత ప్రభావాన్నీ తెలియజేస్తాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అందుకు ఉదాహరణగా కొన్ని మాత్రమే..

* స్వేచ్ఛ * 
స్వేచ్ఛాపిపాసులు సాహసికులైన
పితృపాదులకు పుట్టామని గొప్పలు చెబుతారే
ఈ భూమిపైన ఒక్క బానిస శ్వాస వినిపించినా
మనం నిజంగా స్వేచ్ఛగా సాహసంగా వున్నామంటారా?

సోదరుడికి నొప్పి కలిగించే శృంఖలాల బాధ
మీకు అనుభవంలోకి రాదా?
అప్పుడు అసలైన బానిసలు
స్వేచ్ఛకు అనర్హులు మీరే కదా!

మన ఆప్తుల కోసం శృంఖలాలు
బద్దలు కొట్టడమే స్వేచ్ఛకు అర్థం
ఈ శరీరంలోని హృదయ కుహరం
గుర్తు చేయదా మానవాళికి మన రుణం
కాదు, నిజమైన స్వేచ్ఛÛభావం
మన సోదరుల శృంఖాలాలు పంచుకోవడం
అప్పుడే కదా మన చేతులు, మనసు కూడా
ఇతరుల స్వేచ్ఛకోసం పనిచేయడం

బాధితులు బలహీనుల కోసం మాట్లాడేందుకు
భయపడే వారే బానిసలు
...

ఆలోచింపచేసే సత్యాల సమక్షంలో
మౌనముద్ర దాల్చేవారే బానిసలు
ముందు నడిచే ఒకరిద్దరితో కలసి
అడుగు వేయలేని వారే బానిసలు
                         - జేమ్స్‌ రస్సెల్‌ లోవెల్‌ (1819-91) అమెరికా రచయిత, సంపాదకుడు

* స్వేచ్ఛ *
ఆ యువ వీరుల మృత కళేబరాలు
అమరులు ఉరి కొయ్యలకు వేళ్లాడుతూ
వారి గుండెలు ముక్కలు చేసే నల్లటిలోహం
చలితో ఘనీభవించినా వారెక్కడో సజీవంగా
అమరస్ఫూర్తితో, అనుపమ శక్తితో
వారు సదా సజీవులే
నవ యువకులారా, రాజులారా
వారు వారి సోదరుల్లో మళ్లీ జీవిస్తారు.
మరల మరల మిమ్మల్ని ధిక్కరిస్తారు
మరణం చేసింది వారిని విశుద్ధులుగా
వారు నేర్చుకున్నారు, నింగినంటారు
....
స్వతంత్ర హంతకుల సమాధి కాదు
అక్కడ స్వాతంత్య్ర బీజాలు మొలకెత్తుతాయి
పుష్పించి, ఫలిస్తాయి
గాలి వానలు వాటిని దూర తీరాలకు చేరుస్తాయి
                    - వాల్ట్‌ విట్‌మన్‌ (1819-92) అట్టడుగు స్థాయిన మొదలై ప్రసిద్ధిగాంచిన ప్రముఖకవి

 

* ఖైదీ * 
మురికి పట్టిన పై కప్పు తలకు తగులుతూ
వూపిరి సలపక వుక్కిరి బిక్కిరి
వాళ్లు నన్ను పీడించారు, ఈ రాతి నేలపై పడేశారు
ఈ ఇనుప సంకెళ్ల బల్ల
ఈ తుక్కు పడక, కుర్చీ, అన్నీ
గోడకు బందీలుగా
ఈ గోడలు సమాధి
ఫలకాల్లా
ఎడతెగని ఈ మూగ
ప్రగాఢ నిశ్శబ్దం
ఎవరైనా సరే జీవచ్ఛవాలే
మొండి గోడలు జైలు ఆలోచనలు
ఎంత నల్లగా ఎంత బాధగా
ఖైదీ ఎంత నిస్తేజంగా పడుండడం
నీ స్వాతంత్రం గురించికలలు కనడం
- ఎన్‌.ఎ.మోర్జోవ్‌ (1854-1946) రష్యన్‌ విప్లవ కవి,నాయకుడు, శాస్త్రజ్ఞుడు.
లండన్‌లో మార్క్స్‌ను కలుసుకున్నాడు.
కమ్యూనిస్టు ప్రణాళికను రష్యన్‌లోకి అనువదించాడు.