Sep 28,2022 23:35

భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రామారావు తదితరులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో గిరిజనుల హక్కల కోపం పోరాటం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు గిరిజన సంఘం, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి అసువులు బాసిన భగత్‌ సింగ్‌ విప్లవోద్యమంలో అస్తమించని భాస్కరుడు అని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో యువత ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిపై పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులను ఎదురించి, పోరాడి ప్రాణత్యాగం చేసిన భగత్‌ సింగ్‌ చరిత్రను కర్ణాటకలో పాఠ్యాంశాల నుంచి తొలగించడం దేశానికే చాలా అవమానకరమని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వానికి నిజమైన దేశభక్తి ఉంటే భగత్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు కుంజం జగన్నాథం, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు టి శ్రీను, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.