ప్రజాశక్తి-రాంబిల్లి : స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క కృషి చేయాలని సిఐటియు, డివైఎఫ్‌ఐ, మత్స్యకార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 92వ వర్ధంతి శుక్రవారం మండలంలోని కొత్తపట్నం గ్రామంలో ఆయా సంఘాల ఆధ్వర్యాన నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి చోడిపల్లి గంగరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం, అందరికీ విద్య, ఉపాధి, కూడు, గుడ్డ, సమానత్వం కోసం కుల మతాలకు అతీతంగా పోరాడిన వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నాటి స్వాతంత్య్ర ఫలాలు నేడు దేశ పాలకులు కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి దేశాన్ని తెగ నమ్ముతున్నారని విమర్శించారు. నేటి దేశ ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధోని అప్పలరాజు, నూకన్న, నూకరాజు, నారాయణ రావు పాల్గొన్నారు.










