Nov 06,2023 21:14

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, బొబ్బిలి, బొబ్బిలిరూరల్‌, శృంగవరపుకోట : న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పురకాయస్థపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చాను చేర్చడంపై రైతులు భగ్గుమన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్రమంగా కేసులు బనాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చాను చేర్చడంపై జిల్లాలో సోమవారం పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ఎక్కడికక్కడ దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎపి రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు ఖండించారు. అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.
కేంద్రం తీరుకు నిరసనగా విజయనగరంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎపి రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యాన రైతులు ఎఫ్‌ఐఆర్‌ కాపీలు దహనం చేశారు. అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు తెలియజేస్తున్న మీడియాపై, జర్నలిస్టులపై, మేధావులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం, రోజుల తరబడి బెయిల్‌ రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను బెదిరించాలనే ఉద్దేశంతో ఎఫ్‌ఐఆర్‌ రైతు సంఘాలను చేర్చారని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల గొంతు నొక్కే బిజెపి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తెగేసిచెప్పారు. తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.శంకరరావు, నాయకులు రమణ, జగన్‌మోహన్‌, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి పట్టణంలోని కోరాడ వీధి కూడలిలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు ఆధ్వర్యాన ఎఫ్‌ఐఆర్‌ కాపీలు దహనం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం న్యూస్‌ క్లిక్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడమే కాక ఎఫ్‌ఐఆర్‌ఒ సంయుక్త కిసాన్‌ మోర్చాను చేర్చి, రైతుల పోరాటాలను అణగదొక్కాలని చూస్తోందని శంకరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.గౌరీ, జె.రామారావు, జి.శంకర్రావు, కార్మికులు పాల్గొన్నారు.
బొబ్బిలి మండలంలోని రంగరాయపురం గ్రామంలో ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఎస్‌.గోపాల్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును తూర్పారపట్టారు. కార్యక్రమంలో నాయకులు యు.భూషణ్‌, సిహెచ్‌.సత్యనారాయణ, కునుకు కృష్ణ, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట పట్టణంలో ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద సిఐటియు, ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ రైతు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న న్యూస్‌ క్లిక్‌పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు. న్యూస్‌ క్లిక్‌పై తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో దేవుళ్ళు, కె.గోపి, ఎం.చందు, కుమార్‌, జి.నాయుడు, ఆర్‌.కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.