ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేయించుకుంటూ, సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనకు పిలుపునిస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేత చర్యలకు పాల్పడటాన్ని ఖండించారు. నిర్బంధాలు, అరెస్టులకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

సమస్యలు పరిష్కరించాలని కోరితే అణచివేత, నిర్బంధాలకు ు పాల్పడుతున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఇన్ గేటు వద్ద బైటాయించారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తెలంగాణలో ఇస్తున్న విధంగా వేతనాలు పెంచాలని కోరుతున్నామని అన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, రాష్ట్ర నాయకులు టివి రమణ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చలో విజయవాడ తలపెడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, నిర్బంధాలు ప్రయోగించడం అన్యాయమని అన్నారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని,గ్రాట్యుటీ చెల్లించాలని,పెన్షన్, ఇఎస్‌ఐ, పిఎఫ్ అమలు చేయాలని, ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. పేదలకు పౌష్ఠికాహారం అందించే ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, సంస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఔట్ గేటు ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.










