
ప్రజాశక్తి -గాజువాక : భెల్ హెచ్‌పివిపి యూనిట్ పరిరక్షణ కోసం ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌ను గెలిపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 31వ తేదీన భెల్ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కంపెనీ మెయిన్ గేటు ఎదుట సిఐటియు, ఐఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఎఐసిటియు ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఈ పరిశ్రమను ఆదుకున్నారని గుర్తుచేశారు. వామపక్షాల మద్దతుతో నడిచిన యుపిఎ-1 ప్రభుత్వ సమయంలో బిహెచ్‌పివిని భెల్‌లోనూ, షిప్ యార్డ్‌ను డిఫెన్స్‌లోనూ విలీనమయ్యాయని తెలిపారు. అనుభవం ఉన్న ఫ్రంట్‌ను గెలిపించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరాం మాట్లాడుతూ, బిహెచ్‌పివి పరిశ్రమను కాపాడుకునేందుకు అనేక పోరాటాలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌లో గుర్తింపు యూనియన్‌గా గెలిచిన ఎఐటియుసి గడచిన సంవత్సర కాలంగా కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. భెల్ కార్మికులు ఎఐటియుసి మాటలకు మోసపోవద్దని కోరారు. భెల్ పరిరక్షణ కోసం ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌ను గెలిపించేందుకు ఉదయించే సూర్యుడు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, సంస్థ ప్రయోజనాలు, మెరుగైన వేతనాల కోసం ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌ను గెలిపించాలన్నారు. కార్మికుల కోసం అహర్నిశలు పోరాడే శక్తి ఈ ఫ్రంట్‌కు ఉందన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తున్న వి.బాబూరావు మాట్లాడుతూ, కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి, సిపిఎం నాయకులు సీతారాం ఏచూరీ, సిఐటియు నాయకులు తపన్‌సేన్ కృషితో బిహెచ్‌పివి భెల్‌లో విలీనమైందన్నారు. ఈ బహిరంగ సభలో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న జిటిపి ప్రకాష్, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు వై.మస్తానప్ప, ఐఎన్‌టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, ప్రోగ్రెసివ్ ఫ్రంట్ చీఫ్ పాటర్న్ ఎస్.జ్యోతీశ్వరరావు, దామోదర్ రెడ్డి, సిఐటియు నాయకులు కె.విజరుకుమార్, పూర్వ యూనియన్ ప్రధాన కార్యదర్శి సోమనాథ్, ఐసిటియు నాయకులు పట్నాయక్ పాల్గొన్నారు.