Nov 07,2023 01:31

విజయవాడ బస్టాండ్‌లో మృతదేహాలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆర్‌టిసి బస్సుల ప్రమాదాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఆరేళ్లుగా కొత్తబస్సులు రాకపోవడం, ఉన్నబస్సులను రిపేర్లుచేసి నడపటం వల్ల వాటి సామర్ధ్యం తగ్గి వేర్వేరు సాంకేతిక కారణాలతో ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదాయం పెరిగినా అభివృద్ధి లేదని కార్మికులు పెదవి విరుస్తున్నారు. 15 ఏళ్లు పూర్తయిన బస్సులను పక్కన పెడుతున్నామని, ప్రతి బస్సు సామర్ధ్యం పరిశీలించిన తరువాతే బయటకు పంపుతున్నామని ఆర్‌టిసి అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి.
విజయవాడ-గుంటూరు నాన్‌స్టాప్‌ ఎసి సర్వీసు బస్సు సోమవారం విజయవాడలో ఫ్లాట్‌ ఫారంపైకి దూసుకువెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. రహదారులపై కాకుండా బస్టాండ్‌లో ప్రమాదం జరగడంపై అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇటీవల సత్తెనపల్లి, పిడుగురాళ్ల, పెదనందిపాడు, దుగ్గిరాల తదితర ప్రాంతాల్లో ఆర్‌టిసి బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. సహజంగా చలికాలంలో మంచువల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో బస్సుల సామర్ధ్యం సరిగా లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంగీకరిస్తున్నారు. గ్యారేజీల నిర్వహణ కూడా సరిగాలేదు. కొత్త నియామకాలు లేవు. ఆకస్మికంగా బయట నుంచి డ్రైవర్లను తీసుకువచ్చి అప్పటికప్పుడు తాతాల్కిక ప్రాతిపదికన నియమిస్తున్నారు.
ఆరేళ్లక్రితం ఉమ్మడి జిల్లాలో దాదాపు 1090 బస్సులు ఉండేవి. ఇప్పుడు మొత్తం 780 బస్సులు మాత్రమే ఉన్నాయి. మరో 360 అద్దె బస్సులు నడుపుతున్నారు. గతంలో కన్నా సర్వీసులు తగ్గాయి. ప్రతి అరగంటకు ఉన్న సర్వీసును గంటకు, కొన్ని గ్రామాలకు రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే బస్సులు నడుపుతున్నారు. బస్సులు రాని గ్రామాల సంఖ్య జిల్లాలో సగానికి పైగా ఉంది. శివారు గ్రామాలకు బస్సు సర్వీసులను నిలిపేశారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత అభివృద్ధి శూన్యం అని చెబుతున్నారు. డ్రైవర్లకు అనారోగ్య సమస్యలు ఉన్నా సిబ్బంది కొరత వల్ల వారినే డబల్‌ డ్యూటీలు కూడా చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. వారానికి ఆరు రోజులు పనిచేస్తే రోజుకు 8 గంటలు డ్యూటీ ఇస్తారు. అంతకంటే ఎక్కువ సమయం కూడా కేటాయిస్తున్నారు. కండక్టర్ల నియామకం నిలిచిపోయింది. దీంతో ఔట్‌ సోర్సింగ్‌లో నియామకాలు చేపట్టి అతి తక్కువ జీతాలతో వీరిని నాన్‌స్టాప్‌ బస్సులకు వినియోగిస్తున్నారు. బస్సులో లోపాలున్నా నామమాత్రపు తనిఖీలతో బయటకు పంపుతున్నారని విమర్శలు లేకపోలేదు. విశ్రాంతి కూడా తగ్గిపోతోంది. 15 గ్యారేజిలలో పరికరాల కొనుగోలుకు తగిన నిధులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి.