Apr 13,2023 00:00

అడవి వెంకన్న గూడెంలో కుంజా బొజ్జి స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

తొలితరం కమ్యూనిస్టు, గిరిజనోద్యమ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు కుంజా బొజ్జి 2వ వర్థంతి కార్యక్రమాలు విలీన నాలుగు మండలాల్లో బుధవారం సిపిఎం శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. బొజ్జి స్థూపానికి, ఆయన చిత్ర పటాలకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతినపూనారు.
ప్రజాశక్తి-విఆర్‌.పురం
అమరజీవి కుంజా బొజ్జి స్వగ్రామం మండలంలోని అడవి వెంకన్న గూడెంలో అయన స్మారక స్థూపం వద్ద సిపిఎం నాయకులు, బొజ్జి కుటుంబ సభ్యులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సిపిఎం జెండాను ఎంపిపి కారం లక్ష్మి ఎగుర వేశారు. బొజ్జి చిత్ర పటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, బొజ్జి సతీమణి లాలమ్మ స్మారక స్థూపానికి పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్న బాబు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బొజ్జి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు కుంజా నాగిరెడ్డి, ఆసు లక్ష్మయ్య, చినమట్టపల్లి ఎంపిటిసి పూనెం ప్రదీప్‌ కుమార్‌, కారం సుందరయ్య, వల్ల కృష్ణారెడ్డి, వడ్లాది రమేష్‌, పార్టీ గ్రామ శాఖ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో..
మండల కేంద్రం రేఖపల్లిలోని సిపిఎం కార్యాలయం బొప్పెన భీమయ్య భవనంలో కుంజా బొజ్జి చిత్ర పటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూనెం సత్యనారాయణ, సోయం చిన్నబాబు, పూనెం ప్రదీప్‌ కుమార్‌, గూటాల శ్రీనివాస్‌, పోడియం శ్రీరామ్మూర్తి, గుండెపూడి లక్ష్మణరావు, తాతబాబు రెడ్డి, ఆత్మకూరు కాంతారావు, వల్ల కృష్ణారెడ్డి, సోడే మల్లయ్య, కుంజా కన్నయ్య, చిక్కల పద్మారావు పాల్గొన్నారు.
ఎటపాక : ఎటపాకలో జరిగిన కుంజా బొజ్జి వర్థంతి సభలో సిపిఎం మండల కార్యదర్శి ఐవి మాట్లాడుతూ గిరిజనుల కోసం, గిరిజనేతర పేదల కోసం భద్రాచలం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం సిపిఎం ఎర్రజెండా చూపిన మార్గంలో తుది శ్వాస వరకు పయనించిన మహనీయుడు, గిరిజన ముద్దుబిడ్డ కుంజా బొజ్జి అని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఎటువంటి ఆస్తులు సంపాదించుకోకుండా, ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి మచ్చలేని మహానాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు డేగల మాధవరావు, ఆకిశెట్టి రాము, ఐ.పద్మ, మండల కమిటీ సభ్యులు జి.హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.
చింతూరు : మన్యం ఆదివాసీల ఆశాజ్యోతి కామ్రేడ్‌ కుంజా బొజ్జి ఆశయ సాధనకు సిపిఎం కార్యకర్తలు ముందుకు నడగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంజా సీతారామయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఎర్రంపేట రచ్చబండ సెంటర్‌ వద్ద గ్రామ శాఖ ఆధ్వర్యంలో కుంజా బొజ్జి చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీపై ఆ నాడు ఫారెస్ట్‌ అధికారులు, భూస్వాముల దాడులను ఎదుర్కొని ప్రజలను ఐక్యం చేసి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా బొజ్జి నాయకత్వంలో పోరాటం చేసినట్టు చెప్పారు. బొజ్జి సాధారణ పార్టీ సభ్యుడు నుండి సమితి అధ్యక్షుడిగా, ఉమ్మడి భద్రాచలం ఎమ్మెల్యేగా పని చేసి, ఏజెన్సీ సుందరయ్యగా పేరుపొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, నాయకులు ఎర్రశెట్టి శ్రీనివాసరావు, పోడియం, లక్ష్మణ్‌, పాండు సుబ్బారావు, కారం కొండయ్య, కారం రాజయ్య, సుందరయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
కూనవరం : గిరిజన హక్కుల కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చట్ట సభల్లోనూ, స్థానికంగా నాయకత్వం వహించిన ధీశాలి కుంజా బొజ్జి అని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య అన్నారు. కుంజా బొజ్జి ద్వితీయ వర్థంతి సభ స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఆయనకు ఘనంగా విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కుంజా రాధ, బొజ్జ సుధా, కారం జయసుధ, బొగ్గా రామారావు, బొగ్గా వెంకమ్మ, ధర్ముల అమ్మాజీ, కట్టం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.