హాస్యం అనేది ఒక తెలివైన భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ. భారతదేశంలో కునాల్ కమ్రా, మునావర్ ఫారూఖీ లాంటి కమెడియన్లు, రచితా తనేజా లాంటి కార్టూనిస్ట్‌లు ఇలాంటి కళలలో భాగస్వాములుగా ఉన్నారు. వారంతా వివిధ రూపాలలో నేర విచారణలను ఎదుర్కొంటున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎంఎల్‌ఏ కుమారుడు ఇచ్చిన ఒక ఫిర్యాదు ఆధారంగా, తనకు ఏ విధంగా సంబంధంలేని హాస్యాన్ని (జోక్‌లు) సృష్టించాడని మునావర్‌ను జైల్లో పెట్టారు. కోర్టును ధిక్కరించారన్న నెపంపై కునాల్, రచితలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చర్యలు, సమకాలీన రాజకీయాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క నిస్సహాయతను నగంగా తెలియజేస్తున్నాయి.
చట్టబద్ధంగా మాట్లాడే మాటలను, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను కార్యనిర్వాహకశాఖ నేరంగా పరిగణించడం, పూర్తిగా వాటిని తొలగించడం లాంటి చర్యలకు పూనుకుంటున్నది. విద్యార్థులు, కార్యకర్తలు, కమెడియన్లు, జర్నలిస్టులను 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (ఉపా) కింద నేరాలను ఆరోపించి కేసులు నమోదు చేయడం, విమర్శలను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా ఉంటున్నది.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న యుద్ధం, మతపరమైన అంశాలతో ప్రజాభిప్రాయాలను నాశనం చేస్తున్నది. ఒకవైపు ముస్లింలపై అపవాదులు వేసే చర్యలను ప్రోత్సహిస్తున్నది. మరో వైపు ప్రభుత్వం లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ చేసినా నేరారోపణలు చేస్తున్నారు. ఆర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినపుడు, దానిని బహిరంగంగా ఖండించిన కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విధానాలతో ఏకీభవించని జర్నలిస్టులకు ఆ విధమైన రక్షణను కల్పించ లేదు. ఇటువంటివి బిజెపి ప్రభుత్వ హిందూ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయి.
నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతుల పట్ల కేంద్రం వైఖరిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, రాజ్యాంగబద్దంగా కల్పించబడిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వక్రీకరిస్తున్నదో తెలుసుకోవచ్చు. మొదటిది, శాంతియుతంగా జరుగుతున్న సభను అనుమతించడానికి బదులుగా, ప్రభుత్వం దాన్ని పరిమితం చేసేందుకు, సరిహద్దు నిరసన ప్రదేశాలలో రోడ్ల మీద మేకులు నాటించడం, కాంక్రీటు గోడలను, బారికేడ్లను నిర్మించడంపై కేంద్రీకరించింది. బారికేడ్లు పెద్ద అవరోధమేమీ కాదు. కానీ ఈ ఒక్క ఉదాహరణ ప్రభుత్వ హింసాత్మక చర్యను తెలుపుతుంది. ఇంటర్నెట్, విద్యుత్తు, నీటి సరఫరాలను కుదించడంతో పాటు, గౌరవప్రదమైన జీవితానికి, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), 21ని పూర్తిగా నిలిపివేశారు.
రెండవది, ప్రభుత్వం నిరసనలను చాలా చురుగ్గా అడ్డుకుంటుంది. అనేక మంది నిరసనకారులను నిర్బంధించింది. అనేక సందర్భాల్లో హింస చెలరేగింది. ప్రభుత్వం, దాని మిత్రులు చొచ్చుకొని పోవడం వల్లనే ఈ హింస చెలరేగిందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీకి రైతులు రాకుండా అడ్డుకునేందుకు, నిరసనలకు కేంద్రంగా ఉన్న ఆగ్రాలో రైతులను హౌస్ అరెస్ట్ చేయించింది.
మూడవది, రైతుల ఉద్యమంపై తయారైన విమర్శనాత్మక నివేదికలలో కొన్ని అంశాలను తొలగించడం, నేరారోపణలు చేసి కేసులు బనాయిస్తామనే బెదిరింపుల ద్వారా అడ్డుకునే విధానం, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలను, ప్రతిఘటనను అణచివేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయ విమర్శలకు గురయ్యాయి. ఫిబ్రవరి 2న నిరసనలలో సంభవించిన మరణాల గురించి...తమ నివేదికల ద్వారా తెలియజేసిన కనీసం ఎనిమిది మంది సీనియర్ జర్నలిస్టులపైన దేశద్రోహం కేసులు, మత సామరస్యానికి విఘాతం కలిగించారని నేరారోపణలు చేస్తూ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను తొలగించడం మొదలుపెట్టింది.
భారతదేశంలో ప్రస్తుతం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పరిస్థితి, 1970వ దశకంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీతో పోల్చే విధంగా ఉంది. ఇప్పుడు, బిజెపి రాజ్యాంగంపై చేసిన దాడులన్నీ అనధికారమైనవి, అయినా వాస్తవమైనవి. ఒక్క అధికారిక రాజ్యాంగ సవరణ లేకుండా, ప్రభుత్వం అనేక ప్రాథమిక హక్కుల అమలును రద్దు చేసింది. రాజకీయ చర్చల కుదింపుతో, సమకాలీన భారతదేశం దురదృష్టం కొద్దీ వాస్తవ ఎమర్జెన్సీకి దగ్గరగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం నిరసనలను ''అంతర్గత అల్లర్లగా'' పరిగణిస్తూ, వాటిపై గట్టి చర్యలకు పూనుకుంటోంది.
న్యాయ విధానం
కార్యనిర్వాహకవర్గం ఎవరూ అంగీకరించని రీతిలో భావ ప్రకటనను పరిమితం చేసినప్పుడు...న్యాయ వ్యవస్థ ఈ స్వేచ్ఛను సంరక్షిస్తుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. 1950లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు కేసులు సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. మొదటిది, 'క్రాస్ రోడ్స్' పత్రికపై మద్రాసు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సవాల్ (రొమేష్ థప్పర్ వెర్సస్ మద్రాసు ప్రభుత్వం). రెండవది, 'ఆర్గనైజర్' పత్రికపై కార్యనిర్వహక ఉత్తర్వులు విధించిన నియంత్రణకు వ్యతిరేకంగా సవాల్ (బ్రిజ్ భూషణ్ వెర్సస్ ఢిల్లీ ప్రభుత్వం). 'క్రాస్ రోడ్స్' రొమేష్ థప్పర్ సంపాదకత్వంలో నిర్వహించబడుతున్న కమ్యూనిస్ట్ పత్రిక. 'ఆర్గనైజర్' ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక. ఈ రెండూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం నిలబడ్డాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు ఉండే సుగుణం.
రెండు కేసులలో కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోరిన పిటిషన్‌దారులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ కేసు జరిగిన 70 సంవత్సరాల తరువాత, ఈ జనవరిలో బెయిల్ మంజూరు కోసం మునావర్ ఫారూఖీ పెట్టుకున్న దరఖాస్తును పరిగణన లోకి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టును కోరాడు. అసాధారణంగా ఒక కమెడియన్‌ను అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూరు వాదనలలో, నేరాలు చేసిన వారి తప్పులను గుర్తించని వారిని న్యాయస్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హైకోర్టు నిస్సంకోచంగా చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు సంఘటనలలో రెండు కోర్టుల వైఖరులు భిన్నంగా ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగాన్ని సంరక్షించే క్రమంలో కోర్టు వెంటనే స్పందించింది. రెండవది, ప్రభుత్వానికి ఉన్నంత అసహనాన్ని కోర్టు కూడా ప్రదర్శించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో (కొన్ని మినహాయింపులతో) హైకోర్టు, సుప్రీంకోర్టుల పని తీరు. సుధా భరద్వాజ్, వరవరరావు, ఆనంద్ తెల్‌తుందే లతో పాటు అనేకమంది రచయితలు, విద్యార్థులు, జర్నలిస్టులపై నమోదు చేయబడిన నేరారోపణలను కొట్టివేయాలని పెట్టుకున్న దరఖాస్తులను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏ అరెస్ట్‌కూ రాజకీయ గుర్తింపు గానీ, కోర్టుల అనంగీకారానికి ప్రభుత్వ క్రమబద్ధమైన విధానం గానీ లేకుండా పోయింది. ఆఖరికి ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోరినప్పటికీ, సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి తిరస్కరించింది.
కోర్టులు కూడా కండిషన్ బెయిల్ మంజూరుకు భావ వ్యక్తీకరణను పరిమితం చేసే కఠినమైన నియమ నిబంధనలను విధించడం మొదలు పెట్టాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడన్న అభియోగం మీద అరెస్ట్ చేసిన ఒక యువకుడిని సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాంటి నిషేధం భావ వ్యక్తీకరణకు ప్రత్యక్షంగా ముప్పు కలుగజేస్తుంది. ఈ తొలగింపులు (సెన్సార్ షిప్) న్యాయస్థానాల నుంచి వచ్చాయన్న నిజం ప్రమాదకరమైన సూచికలను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉండే విశ్వసనీయతను బలహీన పరుస్తుంది. అందువలన భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ...న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహక శాఖల నుంచి అనేక దాడులను ఎదుర్కొంటుంది. స్వేచ్ఛ అనేది ఒక రాజకీయ ఆవశ్యకత. ప్రజాస్వామ్యం పునరుత్థానం అవడానికీ, దానితోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం సహాయం అందించిన వారికి దేశం కృతజ్ఞతలు చెప్పే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది.
* తులసీ కె. రాజ్, కాళీశ్వరమ్ రాజ్ ('ఫ్రంట్ లైన్' సౌజన్యంతో)










