
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు, పాత్రికేయుల భద్రతకు పౌర సమాజం మద్దతుగా నిలవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. ఎపియుడబ్ల్యూజె 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సేవ్ జర్నలిజం డేగా పాటించాలన్న యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం తాడేపల్లిగూడెం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో పత్రికారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐజెయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఎపియుడబ్ల్యూజె జిల్లా కన్వీనర్ గజపతి వరప్రసాద్ మాట్లాడారు. గూడెం డిఎస్‌పి శరత్ రాజ్‌కుమార్, తహశీల్దార్ దుర్గా కిషోర్, ఎండిఒ విశ్వనాధ్, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ ఎపిడబ్ల్యూజె వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి తోట సూర్యనారాయణ, బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఎస్‌ఎస్.ప్రసాద్, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కొడాలి రమేష్ బాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ప్రత్తి వీరాస్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు.