ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లలో అనుమతుల్లేకుండా యథేచ్ఛగా నిర్వహిస్తున్న భాష్యం పాఠశాలకు విద్యా శాఖ కొమ్ముకాయడంలో అంతర్యమేమిటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు బి ఆర్య ప్రశ్నించారు. సోమవారం బాపట్ల ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్లకు వ్యతిరేకమని మాయ మాటలు చెబుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అండగా నిలుస్తోందని విమర్శించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన భాష్యం హైస్కూల్‌కు ఎటువంటి అనుమతులు లేవని, ప్రభుత్వ గుర్తింపులేదని అన్నారు. ఏ విధమైన అనుమతులు లేని భాష్యం హైస్కూల్‌ను నిర్వహిస్తుంటే బాపట్ల విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా కళ్లెదుటే భాష్యం స్కూల్ నిర్వహిస్తుంటే విద్యా శాఖ మొద్దు నిద్ర నటిస్తోందన్నారు. ఎలాంటి అనుమతులు లేని భాష్యం విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇప్పటికైనా అనుమతులు లేని భాష్యం హైస్కూలును మూసేయిం చాలని డిమాండ్ చేశారు. అనుమతులు రాకుండానే బాపట్లలో కరపత్రాలు బ్యానర్లు వేసి ప్రచారం చేసి విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను ఆకర్షించి మోసం చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ చేసిన విజ్ఞప్తులతో ఒకసారి పాఠశాలను మూసేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోజ్ పాల్గొన్నారు.










