సంతాప సభలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రవి
ప్రజాశక్తి - చాట్రాయి
భాస్కరరావు అకాల మరణం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రవి అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి కొలికిపోగు భాస్కరరావు గతనెల 31న అనారోగ్య కారణంగా మృతి చెందగా సోమవారం ఆయన గృహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాపసభలో భాస్కరరావు చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎం.హౌలీ మేరీ అధ్యక్షత వహించిన సభలో ఎ.రవి మాట్లాడుతూ ఆయన వృత్తిపరంగా ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తూ పార్టీలో చేరి, మండల కార్యదర్శి స్థాయికి ఎదిగి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. అనారోగ్యంతో అకాలంగా మరణం చెందటం చాలా బాధాకరమన్నారు. పార్టీపై అభిమానంతో తన కుమారుడు లెనిన్‌ని పార్టీకి అందించారని, లెనిన్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారని తెలిపారు. సమాజంలో అందరూ కుమారులకు వారసత్వంగా సంక్రమించిన డబ్బు, భూములు పంచి ఇస్తారని కానీ వారసత్వంగా తన కుమారుడిని పార్టీకి అందించిన ఘనత భాస్కరరావుకే దక్కిందని కొనియాడారు. అనంతరం జిల్లా కార్యదర్శి జి.రాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా సిఐటియు అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.కళ్యాణ్, ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల కార్యదర్శి జి.నాగరాజు మాట్లాడారు. భాస్కర్‌రావు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ సంతాప సభలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్, సిఐటియు మండల కార్యదర్శి టిఎన్‌ఎం.సూరి, సిపిఎం మాజీ మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, పార్టీ సభ్యులు గజ్వేల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.