Sep 11,2022 23:25

లక్ష్మీపార్వతిని సత్కరించి జ్ఞాపికను అందిస్తున్న రచయితల సాహితీ సంక్షేమ సంఘం సభ్యులు

ప్రజాశక్తి-సింహాచలం: అన్ని బంధాల కన్నా భాషా బంధం గొప్పదని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. రచయితల సాహితీ సంక్షేమ సంఘం నేతృత్వంలో సింహాచలంలో జరుగుతున్న జాతీయ సాహిత్య సంబరాలు చివరి రోజు కార్యక్రమంలో లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రాచీన-ఆధునిక సాహిత్యంపై ప్రసంగించారు. ఎన్‌టిఆర్‌ తనను ఇష్టపడి అక్కున చేర్చుకోవడానికి ప్రధాన కారణం సాహిత్యమేనని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు తెలుగు భాష తీరును ఆమె వివరించారు. అంతరించిపోతున్న భాషల్లో తెలుగు భాష ఉందంటూ యునెస్కో చేసిన ప్రకటనను ఆమె ఖండించారు. తెలుగు భాషకు మరణం లేదని, విశాల తత్వమే తెలుగు భాష గొప్పతనం అని పేర్కొన్నారు. తెలుగు భాష రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సభలో ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు అయ్యంగారి సీతారత్నం రచించిన షాప్‌ లైవ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ వెంకటరమణ, ఇందు రమణ, సంగం డైరెక్టర్‌ యువశ్రీ తో పాటు అధిక సంఖ్యలో రచయితలు కూడా హాజరయ్యారు.
అప్పన్నను దర్శించుకున్న లక్ష్మీపార్వతి
రాష్ట్ర తెలుగు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు లక్ష్మీపార్వతి ఆదివారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఎఇఒ ఆనంద్‌ కుమార్‌ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆమె ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం చుట్టూ ప్రదక్షిణం చేశారు. స్వామి అంతరాలయంలోనూ, గోదాదేవి సన్నిధిలోను ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. ఆమెకు స్వామి వారి ప్రసాదాన్ని ఎఇఒ ఆనంద్‌ కుమార్‌ అందజేశారు.