
సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
ప్రజాశక్తి - ఆకివీడు
ప్రేమ పేరుతో మోసం చేసిన మానవ మృగం వాడపల్లి రాంబాబును బహిరంగంగా ఉరి తీయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శనివారం ఆకివీడులో జరిగిన సంధ్యారాణి హత్యపై పలు సంస్థలు, సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డోకల రవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత దుంపగడప రోడ్డులోని బాధితుల నివాసం దగ్గర నుంచి రైల్వే గేటు, రైల్వే స్టేషన్ రోడ్డు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలు గుండా ర్యాలీగా దొరగారిచెరువు గట్టు వద్దకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి అక్కడ జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్ పర్సన్ జామి హైమావతి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. సంధ్యారాణిని హత్య చేసిన రాంబాబును ఉరి తీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వైసిపి అండగా ఉంటుందన్నారు. ఐద్వా నాయకురాలు సందక ఉదయకుమారి మాట్లాడుతూ సగటు మహిళకు భయం కల్పించే ఈ చర్యలను యావత్ లోకం ఖండించాలన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, సందక సూరిబాబు, డివైఎఫ్‌ఐ నాయకులు బి.వర్మ, గేదెల రాము, వైసిపి నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గేదెల లావణ్య, సందక సూరిబాబు, బొడ్డుపల్లి రాంబాబు, గేదల ధనుష్, జి.రాంబాబు, ఆర్యవైశ్య సంఘ నాయకులు వినోద్‌కుమార్, నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ పుప్పాల సత్యనారాయణ (పండు), వైసిపి నాయకురాలు మొర జ్యోతి పాల్గొన్నారు.