Mar 06,2023 23:48

నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడిస్తున్న సిఐ అశోక్‌కుమార్‌

ప్రజాశక్తి -సీలేరు
జీకే వీది మండలం, మొండిగడ్డ పంచాయతీ, గాలిమాను వీధిలో ఇటీవల భార్య విజయలక్ష్మిని నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు సంబంధించి నిందితుడు గుబులంగి రామచంద్రరావును సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం జికె.వీధి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జికె.వీధి సిఐ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. సిఐ కథనం ప్రకారం... మొండిగడ్డ పంచాయతీ గాలిమాను వీధికి చెందిన గుబులంగి రామచంద్రరావుకు ఒడిశా రాష్ట్రంలో బత్తరకు చెందిన విజయలక్ష్మికి 2009లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు మద్యానికి బానిసై భార్య విజయలక్ష్మితో తరచూ తగాదా పడుతుండేవాడు. భర్త ఏ పని చేయకుండా మద్యం సేవిస్తూ ఉండడంతో విజయలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. మద్యానికి డబ్బులు ఇవ్వమని తరచూ భార్యను వేధించేవాడు. ఇటీవల కాఫీ పిక్కలు అమ్మగా వచ్చిన డబ్బులను కుటుంబ పోషణ కోసం విజయలక్ష్మి తన దగ్గర ఉంచుకుంది. రామచంద్రరావు ఈ నెల 1వ తేదీన సాయంత్రం పూటిగా మద్యం సేవించి వచ్చి కాఫీ పిక్కలు అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వమని భార్య విజయలక్ష్మితో గొడవపడ్డాడు. డబ్బులు ఇచ్చేందుకు విజయలక్ష్మి నిరాకరించింది. దీంతో అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రామచంద్రరావు తన దగ్గరున్న నాటు తుపాకీతో నిద్రలో ఉన్న విజయలక్ష్మి తొడపై కాల్చాడు. పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు సంఘటన ప్రదేశానికి చేరుకొని చూసే సరికి రామచంద్రరావుచేతిలో నాటుతుపాకీ ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, అతడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి రక్త స్రావంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందింది. నిందితుడు రామచంద్రరావు కోసం స్థానికులు గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా తమ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రింతాడ పంచాయతీ పరిధి మల్లమెట్ట జంక్షన్‌ వద్ద సోమవారం వాహన తనిఖీలు చేస్తుండగా నిందితుడు రామచంద్రరావు పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి, ఆయన వాడిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం రామచంద్రరావుపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఈ మీడియా సమావేశంలో జికె.వీధి ఎస్‌ఐ కె.అప్పలసూరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.