May 29,2023 21:23

ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : భార్యపై అనుమానంతో పాటు, అదనపు కట్నం తెమ్మని భార్యను కొట్టి ఆమె మృతికి కారకుడైన వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ గుంటూరు 2వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి విఎఎల్‌ సత్యవతి సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలోని నాగేంద్ర స్వామి గుడి వీధికి చెందిన దుర్గం బాలకృష్ణకు 2017 ఫిబ్రవరి 15న చిలకలూరిపేట చాకలి బజారుకు చెందిన శివపార్వతితో పెదకాకాని శివాలయంలో వివాహమైంది. ఆ వివాహ సమయంలో శివపార్వతి తల్లిదండ్రులు రూ.90 వేలు నగదు ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే కట్నం చాలలేదని తండ్రి శివన్నారాయణ, బాబారు సీతా రామయ్య, పిన్ని రమాదేవి ప్రోద్బలంతో బార్యను బాలకృష్ణ వేధించటం ప్రారంభించాడు. దీనికితోడు పెళ్లయిన 10 రోజులకే బాలకృష్ణ తన భార్యపై అనమానం పెంచుకుని ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. 2017 మే 14 న రాత్రి బాలకృష్ణ తాను తాపీ పని చేసేటప్పుడు వాడే మూల మట్టంతో తన భార్యను కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఆమెను బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ఆమె 21న మృతి చెందింది. దీనిపై మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తండ్రి శివన్నారాయణ, బాబారు సీతారామయ్య, పిన్ని రమాదేవిపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నార్త్‌ డీఎస్పీ జి.రామాంజనేయులు కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్స్‌ తరపున డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ (ఎపిపి) పాతూరి మధుసూదనరావు వాదించారు. బాలకృష్ణపై నేరం రుజువు కావడంతో అతనికి జైలు శిక్ష, జరిమానా విధించి మిగిలిన ముగ్గురిపై కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.