ప్రజాశక్తి - నాదెండ్ల : బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలంలో మంగళవారం వాటిల్లిన రోడ్డు ప్రమాదంలో డప్పు కళాకారుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండల కేంద్రానికి చెందిన దావులూరి రావమ్మ, లక్ష్మయ్య దంపతుల రెండో కుమారుడైన ప్రసన్నకుమార్ (27)కు బాపట్ల జిల్లా అద్దంకి మండలం వెంకటాపురానికి చెందిన ఝాన్సీతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమారుడు, మూడు నెలల పాప ఉన్నారు. ప్రసవం కోసమని పుట్టింటికి వెళ్లిన ఝాన్సీ ప్రసవానం తరమూ పుట్టింటి వద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యాబిడ్డల్ని చూసివద్దమని ప్రసన్న కుమార్ తన బంధువుల ఆటోను తీసుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెంకటాపురానికి మంగళవారం బయలు దేరాడు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత ఆటో బొల్లాపల్లి టోల్‌గేట్ దాటిన తర్వాత నారినవారిపాలెం సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గరల్లో జాతీయ రహదారిపై కుక్క అడ్డుం వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటో బొల్తా పడింది. ఆటోను నడుపుతున్న ప్రసన్నకుమార్ రోడ్డుపై పడడంతో అతనిపై ఆటో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆటోలో మృతుని తోపాటు ఉన్న గుడిమెట్ల గోవర్ధన్, దావల వెంకీకి స్వల్ప గాయాలయ్యాయి. మరో 20 నిముషాల్లో గమ్యం చేరాల్సిన వారు ప్రమా దంలో మృత్యువాత పడడంతో కుటుంబీ కులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మృతుడు ప్రసన్న విద్యార్థి దశలో గుంటూరు నగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ)లో పని చేశారు. అనంతరం ప్రజానాట్య మండలిలోనూ పనిచేశారు. ప్రస్తుతం డప్పు కళాకారునిగా జీవనం సాగిస్తుండంతోపాటు వ్యవసాయ పనులు, ఆటో నడుపుతూ ఉంటాడు. మృతునికి తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. మృతుని తల్లి అంగన్వాడీ టీచర్‌కాగా తండ్రి వ్యవసాయ పనులు చేస్తుంటారు.










