Aug 17,2022 00:10

మాట్లాడుతున్న కేంద్రం మంత్రి మురళీధరన్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం : విద్యా, నైపుణ్యాభివృద్ధితో నేటి యువత భవిష్యత్తులో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలిపేందుకు కృషిచేయాలని కేంద్ర విదేశీ వ్యవహరాలు, పార్లమెంట్‌ వ్యవహరాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అన్నారు. మంగళవారం స్థానిక పోర్టు కళావాణి స్టేడియంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రత్యక్ష ముఖాముఖీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి.మురళీధరన్‌ మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా అనేక పథకాలను ప్రతి పేదవానికి చేరేలా కృషి చేస్తుందని తెలిపారు. యువతకు శిక్షణ నిచ్చి నైపుణ్యాభివృద్ది, వనరులు మంచి వాతావరణం కల్పించేందుకు అనేక పథకాలను కేంద్రప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకాల ద్వారా యువత వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళల పాత్ర దేశాభివృద్ధిలో అగ్రభాగంలో ఉందని, ప్రతి తల్లి, చెల్లికి సమాన అవకాశాలు ఇవ్వాలని అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. రైతులు దేశానికి వెన్నెముక అని, భూసార పరీక్షల కోసం కార్డులను వారికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జివిఎల్‌.నరసింహరావు, ఎమ్మెల్సీ మాధవ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరక్టర్‌ బెందాళం లక్ష్మీపతి, వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.