Mar 01,2022 08:32

న్యూఢిల్లీ :  గూగుల్‌ కంపెనీ మరో కొత్త సర్వీస్‌ను భారత్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్‌ ప్లే పాస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్రకటనలు లేకుండా యాప్స్‌, గేమ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత సర్వీస్‌. పస్తుతం ప్లే పాస్‌ 90 దేశాల్లోని యూజర్లకు అందుబాటులో ఉంది. మార్చి మొదటి వారం నుంచి భారతీయ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

యూజర్లు నెలవారీ లేదా ఏడాదిపాటు గూగుల్‌ ప్లే పాస్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి వుంటుంది. ప్లే పాస్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 99 కాగా, ఏడాదికి రూ. 899గా గూగుల్‌ నిర్ణయించింది. ప్రీపెయిడ్‌ తరహాలో ప్లే పాస్‌ ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు నెలకు రూ. 109 చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్‌ ఫ్యామిలీ గ్రూప్‌ యూజర్లు తమ ప్లే పాస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను మరో ఐదుగురు యూజర్లతో షేర్‌ చేసుకోవచ్చు.

దీని కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెర్చ్‌లో ప్లే పాస్‌ అని టైప్‌ చేయాలి. తర్వాత సబ్‌స్క్రైబ్‌ చేసుకుని గేమ్స్‌, యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. గూగుల్‌ ప్లే పాస్‌ ద్వారా 59 దేశాలకు చెందిన డెవలపర్స్‌ రూపొందించిన 41 కేటగిరీలకు చెందిన 1000కి పైగా యాప్స్‌, గేమ్స్‌ను యూజర్స్‌ వినియోగించవచ్చు. ఇందులో జంగిల్‌ అడ్వెంచర్స్‌, వరల్డ్‌ క్రికెట్‌ బ్యాటిల్‌ 2, క్రియేటివ్‌ మంకీ గేమ్స్‌ వంటి భారతీయ డెవలపర్స్‌కు చెందిన 15 యాప్స్‌ ఉన్నట్లు గూగుల్‌ వెల్లడించింది.

యూజర్లకు మెరుగైన సేవలందించడంలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని గేమ్స్‌, యాప్స్‌ను ప్లే పాస్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్‌ పేర్కొంది. గూగుల్‌ ప్లే పాస్‌లో యాప్‌ను పరిచయం చేయాలనుకునే డెవలపర్స్‌ తమ యాప్‌ పేరును ప్లే పాస్‌ వెబ్‌ పేజ్‌ నుంచి నమోదు చేయవచ్చని గూగుల్‌ తెలిపింది. యాపిల్‌ కూడా ఆర్కెడ్‌ పేరుతో ఇదే తరహా సేవల్ని యూజర్లకు అందిస్తుంది.