Sep 09,2021 06:32

ప్రజాస్వామ్య క్రమం పవిత్రత అనేది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. అయితే, గతంలో కొన్ని దశల్లో, ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలో ఈ క్రమానికి కొన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్లమెంట్‌లో విస్తృత మెజారిటీ వున్న ఫలితంగా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది.

భారీ మెజారిటీలు, పటిష్టమైన ప్రభుత్వాలు వున్నపుడు అధికారంపై దృష్టి కేంద్రీకరించే భారత రాజ్యాంగ ధోరణి గురించి పండితులు, మేథావులు విస్తృతంగా రాశారు. సహకారాత్మక నిర్ణాయక క్రమం, తనిఖీలు, బ్యాలెన్స్‌లు, వ్యక్తిగత ఏకపక్షవాద నిర్వహణ వంటి వాటిని పొందుపరుస్తూ ప్రజాస్వామ్య క్రమం రూపొందించబడింది. ఈ ప్రక్రియ అనుసరించే వివేకం, నిజాయితీ, సమగ్రత, మనం ఆచరించే ప్రజాస్వామ్య నాణ్యత గురించి బలంగా పేర్కొంటాయి. అందువల్ల, ఈ ప్రక్రియ అనేక రంగాల్లో తీవ్ర దాడికి గురవుతుండడం పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

తుడిచిపెట్టుకుపోతున్న ప్రభుత్వ జవాబుదారీతనం
ప్రధాని, మంత్రిమండలి లోక్‌సభకు జవాబుదారీగా వుండాలని రాజ్యాంగంలోని 75(3) పేర్కొంటోంది. ఈ విధమైన విభజన ద్వారా చట్టసభకు ప్రభుత్వ జవాబుదారీతనం నిర్ధారించబడింది. ప్రభుత్వం రూపొందించే బిల్ల్లులు చట్టంగా మారడానికి ముందుగా పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, పరిశీలించే వేదికను చట్టసభల సభ్యులకు ఇచ్చేందుకు పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయం వంటి కొన్ని పద్ధతులు నెలకొల్పారు. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ రెండో సభగా వుంది.ప్రభుత్వ జవాబుదారీతనాన్ని సాధించేందుకే ఇటువంటి సంక్లిష్ట వ్యవస్థ ఉద్దేశించబడింది. మనవంటి పార్లమెంటరీ వ్యవస్థల్లో ఇటువంటి ప్రత్యేకతలు చాలా వరకు వుండడం సర్వసాధారణం. కానీ, పార్లమెంట్‌లో ఒక పార్టీ ఆధిపత్యంగా వుండడంతో ఈ విభజన అనేది మసకబారుతోంది. సాధించాలనుకున్న జవాబుదారీతనం దెబ్బతింటోంది.

లోక్‌సభలో మెజారిటీ వున్న భారతీయ జనతా పార్టీ లేదా మరే పెద్ద పార్టీ అయినా, ప్రభుత్వంపై పట్టు వున్న పార్టీ ఎలాంటి చెక్‌లను లేదా సమీక్షను గానీ సమర్ధవంతంగా అడ్డుకోగలుగుతుంది. ఇందుకు సంబంధించి కీలకమైన, ఇటీవల చోటు చేసుకున్న అంశాన్ని ఉదహరించవచ్చు. అదేమిటంటే, కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత 2020లో పార్లమెంట్‌ మొదటి సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం. ప్రతిపక్ష పార్టీలు వెనుక నుండి నెడుతుండడం, లోక్‌సభలో ప్రభుత్వ చర్యలపై వారి పర్యవేక్షణ ఏదో ఒక రూపంలో వున్నప్పటికీ, మొత్తంగా బలహీనంగా వున్నాయి. ఆశించిన ఫలితం రాలేదు. బహుశా ప్రభుత్వం, చట్టసభల మధ్య ప్రస్తుతమున్న మన సంబంధాలను పున:పరిశీలించుకోవడమనేది ఈ జవాబుదారీతనం అమరికను ఆచరణలో మరింత అర్ధవంతంగా చేస్తుంది.

రాజ్యసభ అట్టడుగు పాత్ర
పార్లమెంట్‌ రెండో సభ అయిన రాజ్యసభ క్రమం తప్పకుండా పార్లమెంటరీ పోరాటాల ఉద్రిక్తతలు, ఘర్షణలకు సాక్షీభూతంగా వుంటుంది. రాజ్యసభ తన సభ్యులను ఎన్నుకునే తీరు కారణంగా, లోక్‌సభలో వున్న మద్దతు లేదా తోడ్పాటు ప్రభుత్వానికి రాజ్యసభలో వుండదు. అంటే, విధానపరమైన విధి విధానాలు అమలయ్యే వేదికగా రాజ్యసభను చూడడం కంటే ప్రభుత్వాన్ని మరింత నిశితంగా పరిశీలించే శక్తి ఆ సభకు వుందని అర్ధం. ఇటీవలి కాలంలో చాలా కీలకమైన రెండు ధోరణులు (రాజ్యాంగ ప్రక్రియలో మార్పు, మనీ బిల్లు మార్గాన్ని తరచుగా ఉపయోగిస్తుండడం) రాజ్యసభను, జవాబుదారీతనానికి కీలకమైన సాధనంగా వుండే దాని శక్తి సామర్ధ్యాలను బలహీనపరిచాయి.

రాష్ట్రాల శాసనసభలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటాయి. 2003లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణతో, రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి చెందినవారిగా వుండాలి. లేదా ఆ రాష్ట్రంలోనే నివసిస్తూ వుండాల్సిన అవసరం తుడిచిపెట్టుకుపోయింది. సభ్యుల వ్యూహాత్మక నియామకాన్ని, వారి నియంత్రణను ఈ సవరణ అనుమతించింది. ప్రాతినిధ్యం, జవాబుదారీతనం వుండే రెండో సభకు వుండాల్సిన లక్ష్యిత ప్రయోజనానికి ఇది విరుద్ధమైంది.

గతంలో మనీ బిల్లు అంశాన్ని చాలా కూలకంషంగా చర్చించారు. మనీ బిల్లులకు సంబంధించి చూసినట్లైతే, రాజ్యసభ కన్నా లోక్‌సభకు ఈ బిల్లులను చర్చకు చేపట్టడం, ఆమోదించడంపై మరింత ఎక్కువ నియంత్రణ వుంటుందన్నది ఇక్కడ కీలకమైన ఆలోచన. కానీ మన రాజకీయ పొందిక లోని ఈ అంశాన్ని ప్రస్తుత ప్రభుత్వం క్రమం తప్పకుండా దుర్వినియోగం చేస్తూనే వస్తోంది. రాజ్యసభలో మద్దతు లేకపోయినప్పటికీ సాధారణ బిల్లుల మాదిరిగానే మనీ బిల్లులను కూడా లోక్‌సభలో ఆమోదించేస్తున్నారు.
ఇటువంటి చట్టపరమైన విన్యాసాల (రాజ్యాంగపరమైన అవకతవకలు)కు పాల్పడు తున్నందు వల్ల జవాబుదారీతనం, సమీక్ష లేదా పరిశీలన వంటి సెంట్రల్‌ మెకానిజం కొట్టుకుపోతోంది. ఇటువంటి జవాబుదారీ యంత్రాంగంపైనే పార్లమెంట్‌ ఉభయ సభలు ఆధారపడి వున్నాయి.

బిల్లుల నిర్వహణ
బిల్లులను ఆమోదించడానికి సంబంధించిన పార్లమెంట్‌ ప్రక్రియ మరో సమర్ధవంతమైన చర్య. ఈ క్రమానికి సంబంధించి రెండు దశలు వుంటాయి. వాటినిక్కడ చర్చిద్దాం. పార్లమెంటరీ కమిటీల సమీక్షా క్రమం, ఓటింగ్‌ పద్ధతి. బిల్లులను బహిరంగంగా కాకుండా, జనాంతికంగా, సవివరంగా చర్చించే సంస్థలు ఈ పార్లమెంటరీ కమిటీలు. పార్లమెంట్‌లో ఒకోసారి ఇటువంటి సవివరమైన చర్చ సాధ్యం కానపుడు ఈ కమిటీలు చర్చిస్తాయి. ఈ కమిటీల్లో అన్ని పార్టీల సభ్యులు వుంటారు. తరచుగా నిపుణులను కూడా ఇందులో సభ్యులుగా చేరుస్తారు. బిల్లులపై ఇవి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాయి. బిల్లులపై ఈ కమిటీలు ఇచ్చే నివేదికలు సాధారణంగా చూసినట్లైతే చట్టపరమైన క్రమాన్ని మరింత శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అంటే ఈ శుద్ధి చేయడంలో సహాయపడడమనేది విధానపరమైన క్రమంలోనూ, ఆ శాసనంలో పేర్కొనే గణనీయమైన సమాచారం దృష్ట్యా కూడా వుంటుంది.

అయితే, ఈ కమిటీల సామర్ధ్యం తగ్గుతూ వస్తుండడం నిరాశను, ఆందోళను కలిగిస్తోంది. స్వతంత్ర పరిశోధనా సంస్థ పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ జరిపిన విశ్లేషణ చూస్తే, ఆశించినట్లుగా నిపుణుల చర్చలు లేదా సంప్రదింపులనేవి ఎక్కువగా జరగడం లేదు. పేలవమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో ఈ కమిటీలు నడుస్తున్నాయి. సభ్యులు కూడా అరకొరగా సమావేశాలకు హాజరవుతున్నారు. కమిటీలకు బిల్లులను నివేదించడమనేది తప్పనిసరి కాదు. కానీ ఆదర్శవంతమైనది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రేటు బాగా తగ్గింది. ఉదాహరణకు, యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఎ) ప్రభుత్వాలకు చెందిన 14వ, 15వ లోక్‌సభలు వరుసగా 60, 70 శాతం బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు నివేదించాయి. ఇందుకు పూర్తి విరుద్ధంగా, నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఎ) మెజారిటీ గల 16వ లోక్‌సభ (2014-2019) కేవలం 27 శాతం బిల్లులను మాత్రమే కమిటీలకు నివేదించింది. గత కొన్నేళ్ళలో అనేక కీలకమైన బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించకుండానే ఆమోదించేశారు. ఆ బిల్లులపై చర్చకు లేదా వాటి ప్రభావం, ఎదురయ్యే పర్యవసానాలు వేటినీ కూడా నిశితంగా పరిశీలించేందుకు అవకాశాన్ని నిరాకరించారు.

అంతకంటే దారుణమైన అంశమేమంటే, బిల్లులను పార్లమెంట్‌లో హడావిడిగా ఆమోదించిన తీరు. ఉదాహరణకు, 2020 సెప్టెంబరులో ఆమోదించిన మూడు వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను అత్యంత గందరగోళ పరిస్థితుల్లో, వాడిగా, వేడిగా వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమోదించారు. వాటిపైన అస్సలు చర్చే జరగలేదు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ వివాదాస్పదమైన రీతిలో, మూజువాణి ఓటుతో ఆమోదించారు. నిరసనగా ప్రతిపక్షం వాకౌట్‌ చేయడం కూడా మనం చూశాం. ఇటువంటి వైఖరిని సభ లోని ఇతర సభ్యులు గౌరవిస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ అందుకు బదులుగా, ప్రతిపక్షం లేని సమయాన్ని అవకాశంగా తీసుకుని దాదాపు 15 బిల్లులను ఆమోదించారు. పైగా వీటిని పార్లమెంట్‌ ''ఉత్పాదకతా'' సమావేశాలని ప్రభుత్వం చెప్పుకుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా ఇది పునరావృతమైంది. బిల్ల్లులను ఆమోదించడానికి ముందుగా లోక్‌సభ, రాజ్యసభలు ఆ బిల్లులపై సగటున 34, 46 నిముషాలు చర్చించాయి. కేవలం ఒక బిల్లును మాత్రం ఉభయ సభల్లోనూ గంటకు పైగా చర్చించారు. రాజ్యసభలో పూర్తి స్థాయిలో, కనివినీ ఎరుగని రీతిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో బీమా సవరణ బిల్లును ఆమోదించారు.

ఇటీవలే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ, బిల్లులను హడావిడిగా పార్లమెంట్‌ ఆమోదిస్తున్న తీరుపై బహిరంగంగానే విమర్శించారు. ఈ రీతిలో కార్యకలాపాలు జరుగుతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమం ఇలాగే కొనసాగితే, చట్టబద్ధమైన నిబంధనల్లో అనిశ్చితి, అస్పష్టతలు నెలకొంటాయన్నారు. దీనివల్ల న్యాయ సమీక్ష కోరుతూ కేసులు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు.

భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య క్రమం నెమ్మదిగా, నిరంతరంగా క్షీణిస్తోందని చెప్పడానికి ఈ ధోరణులన్నీ కూడా సంకేతాలే. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు ప్రజలు, అటు శాసనకర్తలు ఇద్దరూ అత్యవసరంగా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యయుతమైన, రాజకీయ నిబంధనలనేవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి జీవ నాడి వంటివి.
ప్రణవ్‌ దేవరాజ్‌
/ 'న్యూస్‌ క్లిక్‌' సౌజన్యంతో /