
ప్రజాశక్తి - భీమవరం రూరల్
భీమవరం భారతీయ విద్యా భవన్స్‌కు గ్రీన్ స్కూల్ అవార్డును యునెస్కో అందించడం ఆనందంగా ఉందని, దీంతో తమపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని భవన్స్ ఛైర్మన్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సెప్టెంబర్ 15వ తేదీన న్యూయార్క్‌లో కెవైసి డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ చేతులమీదుగా గ్రీన్ స్కూల్ అవార్డును అందుకున్న ఆయన ఆదివారం భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన జి-20 సదస్సులో తమ భవన్స్‌కు సంబంధించి మౌలిక వసతులు, ఎకో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్ సమర్పించామని, వాటిని మదింపు చేసిన యునెస్కో తమకు గ్రీన్ స్కూల్ అవార్డు ప్రకటించడం హర్షణీయమన్నారు. తమ సంస్థలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ పొదుపు, సెంట్రల్ సోలార్ సిస్టమ్, రెయిన్ హార్వెస్టింగ్ ద్వారా సేంద్రియ సేద్యం, ఎకో సిస్టమ్, క్యు ఆర్ కోడ్‌తో కూడిన వృక్ష సంపద, హరిత తరగతులు, ఆరోగ్యకర వాతావరణం, సామాజిక స్పృహతో కూడిన సేవలు ఇవన్ని తమకు అవార్డు రావడానికి ఉపకరించాయన్నారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.