May 14,2021 07:39

ఆక్సిజన్‌ కొరత అన్నది పచ్చి అబద్ధం. ఈ భూమండలం అంతా ఆక్సిజన్‌ నిండి వుంది. భగవంతుడు దాన్ని మనకందరికీ ఫ్రీ గా ఇచ్చేడు. పీల్చుకోడానికి ప్రతీ ఒక్కరికీ రెండేసి సిలిండర్లు ఇచ్చేడు (ఆ మాట అనగానే సభికుల్లో ఒకరు ''మన ఊరికి ఎప్పటి నుంచి సప్లై చేస్తారండీ?'' అనడిగేశాడు ఉండబట్టలేక). ఆ సిలిండర్లే మన ముక్కుకున్న రెండు కన్నాలూ (కరతాళ ధ్వనులు మారుమోగాయి. అందరూ గఠ్ఠిగా గాలి పీల్చుకున్నారు). ఇంకా చాలకపోతే పెరట్లో ఆవు ముక్కు కన్నాల దగ్గర మీ ముక్కులు పెట్టి కావలసినంత ఆక్సిజన్‌ పీల్చుకోండి. అంతే కాని మో-షా నాయకత్వాన్ని విమర్శించారో, మీ అంతు తేలుస్తాం! (చప్పట్ల హోరు)

''సాంబశివా సత్యవాక్యము సాగనివ్వరు లోకులూ
లోకులూ పలు గాకులూ సన్యాసులూ కడు మూర్ఖులూ
పట్టెడూ పిడికెడూ తింటే పిసినారివాడని అందురూ
అడ్డెడూ మానెడూ తింటే ఆశపోతని అందురూ
లోకులూ పలు గాకులూ సన్యాసులూ కడు మూర్ఖులూ''

    ఈ తత్వాన్ని సభాధ్యక్షుడే స్వయంగా పాడి మా సంఘీభావ సభ ప్రారంభానికి శ్రీకారం చుట్టేడు. అది గ్రామంలో మోడీ ప్రభుత్వం సాగిస్తున్న (?) కరోనా పై పోరుకు సంఘీభావంగా మా మో-షా భక్తబృందం జరుపుకుంటున్న సభ. ఎంతమంది వచ్చేరు, ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉండిపోయాయి, వచ్చినవాళ్ళలో చివరిదాకా మిగిలినవారెందరు-ఇటువంటి రంధ్రాన్వేషణ ప్రశ్నలు వేయకండి. ''అతడు'' సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ లో నాజర్‌ చెప్పినట్టు ''మనకిప్పుడు కావలసింది నిజాలు కాదు, జ్ఞాపకాలు. అవి నీవల్ల నాకు చాలా ఉన్నాయి''. ఇది మా మో-షా ప్రచారబృందాలకు మోటో. ప్రజలకు నిజాలు చెప్పడం మా పని కాదు. గతానికి సంబంధించి జ్ఞాపకాలను మాత్రం చెప్తూ వుంటాం. అవి కూడా గతకాలపు నిజాలు కావన్నది వేరే చెప్పనవసరం లేదు.
   ప్రధాన వక్తగా రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ మాట్లాడాడు. ప్రతిపక్షాల మీద నిప్పులు చెరిగేడు. ''గతేడాది లాక్‌డౌన్‌ పెట్టాం. అప్పుడు ఎందుకు పెట్టావని అన్నారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ పెట్టలేదు. ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు.
   వ్యాక్సిన్‌ తెచ్చాం. 60 దాటిన వారికే ఎందుకు అన్నారు. పోనీకదా అని 18 నిండినవారికందరికీ వేద్దాం అన్నాం. ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్‌ ఏది అనడుగుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకి వ్యాక్సిన్‌ పంపిణీ ఎందుకిచ్చేరు అనడుగుతున్నారు. నేనడుగుతున్నాను, ఆ ప్రైవేటు ఆస్పత్రి వాళ్ళు వసూలు చేసే ఫీజు పాటి చెయ్యవా మన జీవితాలు ? ఆ మాత్రం ఫీజు చెల్లించడానికి కూడా అప్పు పుట్టించడమో, భూమో, పుట్రో అమ్ముకోడమో, పుస్తెలు తాకట్టు పెట్టడమో చేయలేమా ? ఏమమ్మా మహిళలూ ? మీ భర్తల జీవితాల కన్నా విలువైనవా ఆ పుస్తెలు? ''
   పుస్తెలు, భర్తల ప్రాణాలు వంటి పదాలు చెవుల్లో పడగానే అక్కడికి వచ్చిన అరడజను మంది మహిళలూ చప్పట్లు కొట్టేరు.
కన్వీనర్‌ గర్జన కొనసాగింది. ''ఏం చేస్తారో మాకు తెలియదు, ఆక్సిజన్‌ కొరత ఉండకూడదు అని హైకోర్టు కూడా ఆదేశించింది. కోర్టులు ఏవిధంగా మమ్మల్ని వేధిస్తున్నాయో చూడండి.
   గతేడాది కరోనా వలన చదువులు చెడిపోయాయి. అప్పుడు చదువులు చెడిపోడానికి మేమే కారణం అన్నారు ప్రతిపక్షాలవారు. ఇప్పుడు కరోనా ఉన్నా స్కూళ్ళు నడుపుతూంటే ప్రాణాలే పోతూంటే చదువులు ఎందుకు అనడుగుతున్నారు. పరీక్షలు క్యాన్సిల్‌ చేస్తే మళ్ళీ అడిగేది వీళ్ళే.
   ఎన్నికలు జరపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అంటారు. ఎన్నికలు జరిపితే కరోనా ఉన్నప్పుడు ఎన్నికలేమిటి అంటారు.
అసలెందుకు ఇంత భయపడాలి? మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల 20 లక్షల మంది చచ్చిపోయారు. స్పానిష్‌ ఫ్లూ వచ్చి 5 కోట్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది చచ్చిపోయారు. అ మాటకొస్తే రోజూ జనాలు ఎందుకో ఒకందుకు చస్తూనే వున్నారు. అయినా మనం బతికేవున్నాం కదా? బతికివున్నందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ?
రాజ్యాంగం వాక్స్వాతంత్య్రాన్ని ఇచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తారా?
అసలు కరోనా రావడానికి కారణం ఏమిటి? మీరంతా మాస్కులు పెట్టుకోకపోవడమే. దూరం పాటించకపోవడమే. అందుకు మిమ్మల్ని ఏం చెయ్యాలి?''
''మీకు జిఎస్‌టి వద్దు, పెట్రోలు ధరలు పెరగకూడదు, ఆదాయపు పన్ను ఉండకూడదు, మరి వ్యాక్సిన్‌ లకి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి ? బాధ్యత లేని ప్రతిపక్షాల సంగతి తేల్చాలి. అందరూ మో-షా నాయకత్వాన్ని బలపరచాలి'' అన్నాడు. ఉపన్యాసం ఆగినందుకో, లేక మరెందుకో గాని సభలో ఉన్న రెండు డజన్ల మందీ చప్పట్లు గట్టిగానే కొట్టారు.
అప్పుడు గ్రామం తరఫున మాట్లాడడానికి మో-షా గ్రామ సీనియర్‌ సభ్యుడిని ఆహ్వానించేరు. అతగాడు అప్పటికే చాలా ఊపు మీద ఉన్నాడు. మైకు అందుకోగానే దంచడం ప్రారంభించేడు. ''మన సిద్ధాంతం ఎంత గొప్పదో, ప్రపంచానికే మనం విశ్వగురువులం ఎందుకు అయ్యామో ఇప్పుడు స్పష్టంగా కనపడడం లేదా? తక్కిన ప్రపంచం అంతా కరోనా రాగానే మందులు, మాకులు, ఆస్పత్రులు అంటూ వెంపర్లాడేరు. మరి మనమో? చప్పట్లు కొట్టి, కరోనాను పిలిచాం. దీపాలు వెలిగించి దారి చూపించాం. అదీ మన సత్తా (చప్పట్లు).
తపస్సు చేసి దేహాన్ని శుష్కింపజేయగల శక్తి మన ఋషులకి ఉంది. ప్రజలందరినీ, ముఖ్యంగా పేదవాళ్ళని మహాఋషుల స్థాయికి తీసుకెళ్ళాలనే మహత్తర లక్ష్యం మనది. కరోనా సమయంలో వారికి తిండి పెట్టి, డబ్బులిచ్చి వారికి తపోభంగం చేస్తామా? చచ్చినా చెయ్యం. 10 కోట్ల టన్నుల తిండిగింజలు పాడైపోయినా, పందికొక్కులు తినేస్తున్నా సరే, మనం పేదల తపస్సుకు భంగం కలిగించడం లేదు. మన మహదాశయం అర్ధం కాని మత విద్రోహులు ఏమైనా వాగనీయండి. మరీ మితిమీరితే మాత్రం వాళ్ళ నాలుకలు తెగ్గోస్తాం. ఖబడ్దార్‌ ! ( చప్పట్లు - గట్టిగా)
ఆక్సిజన్‌ కొరత అన్నది పచ్చి అబద్ధం. ఈ భూమండలం అంతా ఆక్సిజన్‌ నిండి వుంది. భగవంతుడు దాన్ని మనకందరికీ ఫ్రీ గా ఇచ్చేడు. పీల్చుకోడానికి ప్రతీ ఒక్కరికీ రెండేసి సిలిండర్లు ఇచ్చేడు (ఆ మాట అనగానే సభికుల్లో ఒకరు ''మన ఊరికి ఎప్పటి నుంచి సప్లై చేస్తారండీ?'' అనడిగేశాడు ఉండబట్టలేక.). ఆ సిలిండర్లే మన ముక్కుకున్న రెండు కన్నాలూ. (కరతాళ ధ్వనులు మారుమోగాయి. అందరూ గఠ్ఠిగా గాలి పీల్చుకున్నారు. ) ఇంకా చాలకపోతే పెరట్లో ఆవు ముక్కు కన్నాల దగ్గర మీ ముక్కులు పెట్టి కావలసినంత ఆక్సిజన్‌ పీల్చుకోండి. అంతే కాని మో-షా నాయకత్వాన్ని విమర్శించారో, మీ అంతు తేలుస్తాం! (చప్పట్ల హోరు) గంగాజలం ముందు కరోనా బలాదూర్‌ అని చెప్పడానికే కుంభమేళా జరిపాం. ప్రజల ప్రాణాలకన్నా ప్రజాస్వామ్యం మిన్న అని భావించాం గనకే ఎన్నికలు జరిపాం. కరోనిల్‌ మందు రాందేవ్‌ బాబా ఇస్తూంటే అది మానేసి ఏవేవో మందులనీ మాకులనీ వెంపర్లాడడం మన సాంప్రదాయమా? బాబా ఎంత ఫీలవుతున్నారు చూడండి! ఈ భూమాత కన్నా గొప్ప ఆస్పత్రి ఎక్కడైనా ఉందా? గో మూత్రం కన్నా పవిత్రమైన ఔషధం ఉందా? నా సవాల్‌ కి సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది ? (చప్పట్లే చప్పట్లు)
ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే పన్ను, ఒకే నేత-ఇవన్నీ సాధించాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఒకే కరోనా దేశం అంతటా సాధించాం. ప్రపంచంలో మరే దేశమైనా ఇలా చేయగలిగిందా? మనది భారతీయతతో కూడిన ప్రత్యేకమైన కరోనా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఒప్పుకుందా? లేదా? ఏవో కొన్ని అల్ప ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత మాత్రాన ఆ మహా యజ్ఞం ఆగుతుందా? ఆగదు ! ఆగదు ! ఆగదు ! జై మో-షా'' (ఆగకుండా చప్పట్లు)
ఇంతలో ఆ గ్రామ నాయకుడి కొడుకు వచ్చి ''నాన్నోరు! అమ్మకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నిన్ను కూడా పరీక్ష చేయంచుకోమంది.'' అని గట్టిగా అరిచి చెప్పేడు. గ్రామ నాయకుడు గుడ్లు తేలేసి చతికిలబడ్డాడు. అక్కడికి చేరిన రెండు డజన్ల మో-షా భక్తులు ''ఈయన ఉపన్యాసం ఇంత సేపూ విన్నాం. మనం కూడా టెస్టు చేయించుకోవాలో ఏమిటో పదండిరా'' అనుకుంటూ పరుగులు తీసేరు. రాష్ట్ర పరిశీలకుడు శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అవసాగాడు.
జై మో-షా !