1938 ఇన్సూరెన్సు చట్టాన్ని సవరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇన్సూరెన్సు కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 49 శాతం నుండి 74 శాతానికి పెంచుతూ చట్టాన్ని సవరించనున్నారు. భారతీయ బీమా రంగం మీద ప్రజల అదుపును తగ్గించే ప్రక్రియ అమలులో మరో అడుగు ముందుకు పడింది. ఈ సవరణ గనుక ఆమోదం పొంది అమలయితే మన దేశంలో జరిగే ఇన్సూరెన్సు వ్యాపారంలో అత్యధిక భాగం విదేశీ పెత్తనం కిందకు పోతుంది.
దేశానికి ఆర్థిక స్వావలంబన ఉండాల్సిందేనంటూ వాదించే స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి తన భాగస్వాములను సంతృప్తి పరచాలి కదా. అందుకే విదేశీ పెత్తనంలోకి ఇన్సూరెన్సు కంపెనీలు పోయినా, వాటిపై స్వదేశీ పర్యవేక్షణ ఉంటుందని ఆర్థిక మంత్రి వారిని ఊరడించారు. ఆ కంపెనీల బోర్డుల్లో కీలక స్థానాల్లో ఉండేవారు, మెజారిటీ బోర్డు సభ్యులు భారతదేశంలో నివసించేవారై ఉండాలన్న నిబంధనను, కనీసం 50 శాతం బోర్డు సభ్యులు స్వతంత్ర సభ్యులై వుండాలన్న నిబంధనను, లాభాల్లో కొంత శాతం (ఎంత శాతమో నిర్దిష్టంగా పేర్కొనలేదు) మన దేశంలోనే రిజర్వు కింద ఉంచాలన్న షరతును విధిస్తామని ప్రకటించారు. ఆ విషయం ప్రకటిస్తూ చేసిన బడ్జెట్ ప్రసంగం లోనే కనీసం ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. అదే ప్రసంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్‌ఐసి వాటాలను స్టాక్ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టనున్నట్టు తెలిపారు. అందుకవసరమైన చట్ట సవరణ చేయనున్నట్టు తెలిపారు.
ఇంతవరకూ వాడుతున్న 'పెట్టుబడుల ఉపసంహరణ' అన్న పదాలకు బదులు సాధారణ బీమా విషయంలో 'ప్రైవేటీకరణ' అన్న పదాన్ని ఆర్థిక మంత్రి ఉపయోగించడం ప్రభుత్వ దృక్పథంలో వచ్చిన గుణాత్మకమైన మార్పును సూచిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ కు రెండు లక్షణాలు ఉంటాయి. (1) యాజమాన్యంలో మెజారిటీ ప్రభుత్వం వద్దే ఉంటుంది. (2) వాటాల అమ్మకం జరిగిన తర్వాత కూడా ఆ సంస్థ కార్యకలాపాలపై అదుపు ప్రభుత్వం వద్దే ఉంటుంది. సంస్థలో కొంతమేరకు ప్రైవేటు యజమానుల వాటాలు గనక ఉన్నట్టైతే అటు ప్రభుత్వాన్ని, ఇటు సంస్థ యాజమాన్యాన్ని కాస్త క్రమశిక్షణలో పెట్టడానికి వీలవుతుందన్నది పెట్టుబడుల ఉపసంహరణ సమర్ధకులు చెప్పే వాదన. అయితే ఇప్పుడు ఆ పదాన్ని విడిచిపెట్టేశారు. 'వాటాల అమ్మకం ద్వారా పెట్టుబడులకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు' అని ఇప్పుడు చెప్తున్నారు. బడ్జెట్ ఖర్చులకు కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటూనే...మరోవైపు ద్రవ్యలోటు అదుపులో ఉండేలా చూసుకోవచ్చును అని సమర్ధించుకుంటున్నారు. ఆర్థిక రంగంలో లాభాలు ఆర్జించడానికి చూస్తున్న కార్పొరేట్లను సంతృప్తి పరచడంతోబాటు, బడ్జెట్ ఖర్చుకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకోడానికి ఇన్సూరెన్సు సంస్థలను గంపగుత్తగా అమ్మేస్తున్నారు.
జీవిత బీమా వ్యాపారంలో ప్రస్తుతం ఎల్‌ఐసి తోబాటు మరో 23 కంపెనీలు ఉన్నాయి. సాధారణ బీమా రంగంలో 4 ప్రభుత్వ రంగ సంస్థలతోబాటు 30 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. ఎక్కువ ప్రైవేటు కంపెనీల్లో విదేశీ కంపెనీల భాగస్వామ్యం ఉంది. ఇది సరళీకరణ విధానాల పర్యవసానమే. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త మార్పు వలన ఈ విదేశీ కంపెనీలకు మెజారిటీ వాటాలు పొందే అవకాశం లభిస్తుంది. అంటే మన దేశీయ ఇన్సూరెన్స్ వ్యాపారం మీద విదేశీ ఆధిపత్యం పెరుగుతుంది. మొదట్లో ఎక్కువ కంపెనీల మీద ఆధిపత్యం పెరిగితే, క్రమంగా మొత్తం వ్యాపారంలో ఎక్కువ భాగం వారి ఆధిపత్యం కిందకు పోతుంది.
తొలుత జీవిత బీమా, సాధారణ బీమా వ్యాపారం మీద నేరుగా ప్రభుత్వమే అదుపు కలిగి వుంది. ఆ తర్వాత దశలో ఐఆర్‌డిఎ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) నిర్దేశించిన మార్గదర్శకాలకు, ప్రమాణాలకు స్వయంగా కట్టుబడి వ్యవహరించే కంపెనీలు నడిపే వ్యాపారంగా మారింది. ఈ ప్రమాణాలలో పెట్టుబడికి సంబంధించినది ఒకటుంది. పట్టాదారులకు చెల్లించవలసిన బీమా మొత్తంకన్నా అదనంగా బీమా సంస్థ వద్ద చేరే మిగులులో కొంత భాగం రిజర్వు నిధిగా తప్పనిసరిగా ఉంచాలన్నది ఆ నిబంధన.
అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తతోటే పట్టాదారులకు పూర్తి రక్షణ గ్యారంటీ అవుతుందని చెప్పలేం. ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేటు ఆధిపత్యం ఉంటే దాని ప్రతికూల పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. యాక్సిడెంట్, అగ్ని ప్రమాదం, అనారోగ్యం, దొంగతనం వంటి అవాంఛనీయ సంఘటనల వలన కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి గాని, లేదా తన మరణం వలన కలిగే నష్టాన్ని తనపై ఆధారపడిన వారికి భర్తీ చేయడానికి గాని వినియోగదారుడు బీమా కంపెనీకి కొంత సొమ్ము చెల్లిస్తాడు. ఆ విధంగా ఒప్పందం మేరకు బీమా సొమ్మును కంపెనీ చెల్లించగలుగుతుందా అన్నది వినియోగదారుడికి తెలియాలంటే ఆ కంపెనీ నడిపే లావాదేవీల గురించి పూర్తి సమాచారం ముందుగానే ఉండాలన్నది సిద్ధాంతం. వినియోగదారులు చెల్లించే సొమ్మును ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుబడులు పెడుతుంది అన్న సమాచారం ఉంటే వినియోగదారుడు సరైన నిర్ధారణకు రాగలుగుతాడు. అటువంటి సమాచారం సక్రమంగా లేకపోయినా, లేక, పూర్తి సమాచారం లేకపోయినా వినియోగ దారుడి బీమా సొమ్ము యొక్క భద్రత ప్రమాదంలో ఉన్నట్టే.
ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు కంపెనీలు పోటీలో ఉంటే ఈ ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుంది. మార్కెట్‌లో ఎక్కువ వాటా వ్యాపారాన్ని చేజిక్కించుకోవడానికి తక్కిన కంపెనీల కంటే తక్కువ సొమ్ముకే బీమా పాలసీలను అమ్మడం జరుగుతుంది. పట్టాదారుల పూర్తి సమాచారం తెలుసుకోకుండానే పాలసీలను జారీ చేసి కంపెనీ నష్టాలపాలు కావచ్చు. ఎక్కువ రాబడి వస్తుందన్న ఆశతో ఎక్కువ రిస్క్ ఉండే వ్యాపారాల్లో కంపెనీ పెట్టుబడులు పెట్టి నష్టపోవచ్చు. అమెరికా వంటి దేశాల్లో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అక్కడ ఎక్కువ కంపెనీలు దివాలా తీశాయి. 1990 దశకంలోనే అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ''హామీలను నిలుపుకోవడంలో వైఫల్యం'' అన్న పేరుతో ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. అందులో ''వేగంగా వ్యాపారాన్ని పెంచాలన్న యావ, దళారులపై అతిగా ఆధారపడడం, రీ ఇన్సూరెన్స్ ఏర్పాట్లు సంక్లిష్టంగా ఉండడం, రిజర్వు నిధి సమస్యలు, బాధ్యతా రహితంగా నిర్వహణ, చేతకానితనం, అవినీతికర కార్యకలాపాలు, దురాశ, స్వంత ప్రయోజనాలు చూసుకోవడం'' ఇన్సూరెన్స్ కంపెనీలు దివాలా తీయడానికి కారణాలుగా పేర్కొన్నారు.
2008 నాటికి కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. మార్కెట్‌లో ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీ అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్. అయినా తన వ్యాపారంలో చాలా బాధ్యతా రహితంగా వ్యవహరించింది. ఎక్కువ రిస్క్ ఉండే లావాదేవీలను విచ్చలవిడిగా చేపట్టింది. నిబంధనలను డొంకతిరుగుడు పద్ధతుల్లో ఉల్లంఘించింది. ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడులపై ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పట్టాదారుల సొమ్ము ఆవిరైపోయింది. అంత పెద్ద కంపెనీ కూడా దివాలా ఎత్తింది. దానిని బెయిల్ అవుట్ చేయడానికి ప్రభుత్వం 18,000 కోట్ల డాలర్ల (రూ.13 లక్షల 56 వేల కోట్లు) 'ప్యాకేజి' ప్రకటించింది!
దీనిని బట్టి విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలనగానే సమర్ధవంతమైన యాజమాన్యం ఉంటుందని అనుకోలేమని స్పష్టం అవుతోంది. ఆ కంపెనీలు నమ్మకమైన చోట్ల తమ పెట్టుబడులు పెట్టాలి (అంటే బహుళజాతి సంస్థలు అని అర్ధం చేసుకోవాలి). ఆ పెట్టుబడులకు అత్యధిక లాభాలు రావాలి (అంటే మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టరు). ఆ లాభాలు కూడా స్వల్పకాల వ్యవధి లోనే రావాలి (అంటే దీర్ఘకాలం పట్టే ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టరు). అంటే విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీల చేతుల్లోకి మన బీమా వ్యాపారం పోతే ఆర్థిక రంగంలో అనవసరమైన, అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందే తప్ప దేశానికి పనికొచ్చే విధంగా పెట్టుబడులను సమీకరించుకోవడం సాధ్యం కాదని బోధపడుతోంది.
ప్రైవేటు చేతుల్లో ఇన్సూరెన్స్ వ్యాపారం చాలా రిస్క్‌తో కూడుకున్నదే కాక, దానివలన ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ వ్యాపారం ద్వారా సమీకరించే సొమ్మును సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చించే శక్తిని కోల్పోతుంది. అదే ఎల్‌ఐసి ని చూడండి. పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వానికి అందుబాటులో పెద్ద మొత్తాల్లో సొమ్మును అందుబాటులో ఉంచింది. ఇక దివాలా ఎత్తడం సంగతి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా దివాలా తీయడమే ప్రస్తుత ధోరణి అయితే, అలా దివాలా తీసే కంపెనీలకు ప్రభుత్వాలు బెయిల్ అవుట్ ఇవ్వడమూ ప్రస్తుతం ఒక ధోరణిగానే ఉంది కదా. ఏదేమైనా ప్రజల బీమా సొమ్ముకు అంతిమంగా ప్రభుత్వం పూచీ పడాలన్న వాదనతో వత్తిడి తెచ్చి దివాలా తీసిన ప్రైవేటు బీమా కంపెనీలకు బెయిల్ అవుట్ ఇచ్చేలా చేస్తున్నారు. అటువంటప్పుడు పబ్లిక్ యాజమాన్యం కింద ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు నడవడమే ప్రభుత్వానికి మేలు కదా? బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం, బీమా వ్యాపారాన్ని ప్రైవేటీకరించడం, ఏ విధంగా చూసినా పూర్తిగా అర్ధరహితం.
* సి.పి.చంద్రశేఖర్(స్వేచ్ఛానుసరణ )










