Jan 07,2021 06:24

నాటి పాతరాతి యుగం నుంచి నేటి నానో డిజిటల్‌ యుగం వరకు విశ్వ మానవాళి నాగరికత వికాసానికి వైజ్ఞానికశాస్త్ర విప్లవాత్మక ప్రగతి ఎంతగానో దోహదపడింది. వైజ్ఞానికశాస్త్రం వెల్లడించిన ప్రక్రియలను సాంకేతికశాస్త్రం అందిపుచ్చుకొని మానవ జీవనశైలిని సులభతరం చేస్తూ వస్తున్నది. నేటి ఆధునిక మానవుడు శాస్త్రసాంకేతికతతో విడదీయరాని సంబంధాన్ని పెనవేసుకొని ఉన్నాడు. శాస్త్రసాంకేతికతను వదిలి క్షణం కూడా గడపలేని స్మార్ట్‌ డిజిటల్‌ వలయంలో చిక్కుకున్నాడు. సాంకేతికశాస్త్రం అనేది కనబడే సుందర భవనం అయితే దానికి మూలాధారమైన కనిపించని పటిష్ట పుణాది వైజ్ఞానికశాస్త్రమే అని మరువరాదు. ఆధునిక వైజ్ఞానికశాస్త్ర పురోగతికి పునాదులు వేసిన భారతీయ మహామహులు ఎందరో తమ జీవితాలను సర్వం అంకితం చేసి అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలతో గుర్తింపు పొందారు. భారతీయ వైజ్ఞానికశాస్త్ర పరిశోధకులలో అపార ఖ్యాతిని గడించిన వారిలో కొందరు వైతాళికులను గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది.

సర్‌ ప్రపుల్ల చంద్ర రాయ్‌:
'భారతీయ రసాయనశాస్త్ర పితామహుడి'గా పేరుగాంచిన ప్రపుల్ల చంద్ర రాయ్‌ లేదా పి సి రారు (2 ఆగష్టు 1861 - 16 జూన్‌ 1944) బెంగాలీ కెమిస్ట్‌, విద్యావేత్త, పారిశ్రామికవేత్త, అధ్యాపకుడు దాతృత్వశీలిగా గుర్తింపు పొందారు. ప్రథమ ఆధునిక రసాయన పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత పిసి రాయ్‌కే దక్కుతుంది. కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ. ఎడిన్‌బర్గ యూనివర్సిటీలో బి.యస్‌సి/డి. యస్‌సి. పూర్తి చేశారు. రసాయనశాస్త్ర చరిత్ర, మూలక రసాయన శాస్త్రం,కర్బన రసాయన శాస్త్రాలలో విలువైన పరిశోధనలు చేశారు. ప్రపుల్ల చంద్ర రాయ్‌ శిష్యులలో ప్రముఖమైన వారుగా సత్యేంద్రనాథ్‌ బోస్‌, మేఘనాథ్‌ సాహ, జ్ఞానేంద్రనాథ్‌ ముఖర్జీ, జ్ఞాన చంద్ర ఘోష్‌ తదితరులు ఉన్నారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ (ఆర్‌యస్‌సి) పురస్కారం అందుకున్నారు. దూరదృష్టి కలిగి 700 రూపాయల నగదుతో పిసి రాయ్‌ దేశంలో ప్రథమ ఫార్మా కంపెనీ 'బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మస్యూటికల్స్‌'ను ప్రారంభించారు. 1896లో మెర్క్యురస్‌ నైట్రైట్‌ను కనుగొన్నారు ఆయన. తన 82వ ఏట అంటే 16 జూన్‌ 1944న తుది శ్వాస విడిచారు.

జగదీశ్‌ చంద్ర బోస్‌:
భారతీయ ప్రముఖ జీవశాస్త్ర, భౌతికశాస్త్ర , వక్షశాస్త్ర పరిశోధకులైన జగదీశ్‌ చంద్ర బోస్‌ (30 నవంబర్‌ 1858 - 23 నవంబర్‌ 1937) రేడియో, మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌ అంశాలతో పాటు వక్షశాస్త్రంలో విస్తత పరిశోధనలు చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌ రచయితగా ఖ్యాతిగాంచిన జె సి బోస్‌ను 'రేడియో సైన్స్‌ పితామహుడి'గా అభివర్ణిస్తారు. క్రిస్కోగ్రాఫ్‌ను కనుగొన్న బోస్‌ పేరును చంద్రమండల బిలానికి పెట్టడంతో అతని ప్రతిభను అంతర్జాతీయ వైజ్ఞానికశాస్త్ర సమాజం గుర్తించినట్లు అయ్యింది. 'బోస్‌ ఇనిస్టిట్యూట్‌'ను స్థాపించి నేడు అత్యున్నత పరిశోధనాలయంగా మలచగలిగారు. బెంగాల్‌కు చెందిన జె సి బోస్‌ కలకత్తా, కేంబ్రీడ్జ్‌, లండన్‌లలో బి.ఏ., బి.యస్‌సి , డి. యస్‌సి పూర్తి చేశారు. ప్రముఖ అంతర్జాతీయ పరిశోధకులు నోబెల్‌ బహుమతి గ్రహీత 'రాలీ'ని గురువుగా భావించిన బోస్‌ శిష్యగణంలో సత్యేంద్రనాథ్‌ బోస్‌, మేఘనాథ్‌ సాహ, పి సి మహవ్‌నోబిస్‌, సిసిర్‌ కుమార్‌ మిత్ర, దేబేంద్ర మోహన్‌ బోస్‌ లాంటి వారు అనేకులు ఉన్నారు. వక్షాలు వేడి, చలి, కాంతి, శబ్దం, సంతోషం, బాధకు చలిస్తాయని రుజువు చేస్తూ, వాటికి ప్రాణం/భావోద్వేగాలు ఉంటాయని కనుగొన్నారు. జె సి బోస్‌ మేధస్సును గుర్తించిన అంతర్జాతీయ వైజ్ఞానిక సమాజం 'కంపానియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎంఫైర్‌', స్టార్‌ ఆఫ్‌ ఇండియా, ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ, నైట్‌వుడ్‌ లాంటి అత్యున్నత పురస్కారాలు అనేకం అందజేశారు.

శ్రీనివాస రామానుజన్‌:
ప్రపంచం మెచ్చిన గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్‌ అయ్యంగార్‌ (22 డిసెంబర్‌ 1887 - 26 ఏప్రిల్‌ 1920) బాలమేధావిగా తన ప్రతిభను ఆవిస్కరిస్తూ, ప్రముఖ గణితశాస్త్ర నిపుణులను సైతం ఆశ్చర్య పరిచారు. గణితంలో పూర్తి విద్యను పొందనప్పటికీ గణిత విశ్లేషణ, సంఖ్య సిద్ధాంతం, అనంత శ్రేణులు, భిన్నాలు లాంటి అంశాల్లో అనేక సూత్రాలు ప్రతిపాదించారు. కళాశాలలో చేరి గణితాన్ని అవపోసన పట్టి, ఇతర సబ్జెక్టులలో ఫె˜యిల్‌ కావడంతో డిగ్రీ పొందలేక పోయారు. వారి గణిత మేధస్సును, పరిశోధనలను గుర్తించిన కేంబ్రిడ్జ్‌ ట్రినిటీ కాలేజి వారు బి. ఏ. పట్టా ఇచ్చారు. యూకె కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన గణితశాస్త్ర పరిశోధకులు జి. హెచ్‌. హార్డీ నేతత్వంలో పలు గణిత సూత్రాలు/సిద్ధాంతాలు ప్రతిపాదించారు. లండన్‌ రాయల్‌ సొసైటీ సభ్యత్వానికి కూడా ఎన్నికైనారు. శ్రీనివాస రామానుజన్‌ అనారోగ్యంతో ఇండియాకు తిరిగి వచ్చి 32వ ఏటనే తుదిశ్వాస విడిచారు.

సత్యేంద్రనాథ్‌ బోస్‌:
భారతీయ గణిత, భౌతికశాస్త్ర నిపుణులు, ప్రఖ్యాత పరిశోధకులు సత్యేంద్రనాథ్‌ బోస్‌ (01 జనవరి 1894 - 04 ఫిబ్రవరి 1974) థియరిటికల్‌ ఫిజిక్స్‌, క్వాంటం మెకానిక్స్‌లో నిష్ణాతులు. అల్‌ఫ్రెడ్‌ ఐన్‌స్టీన్‌తో కలిసి బోస్‌-ఐన్‌స్టీన్‌ స్టాటిస్టిక్స్‌ ప్రతిపాదన చేసి బోస్‌-ఐన్‌స్టీన్‌ కండెన్సేట్‌ సిద్ధాంత రూపకర్తలుగా వైజ్ఞానిక రంగంలో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నారు. ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీతో పాటు భారత ప్రభుత్వ పద్మ విభూషణ్‌ ఆవార్డులు పొందారు. కలకత్తా ,ఢాకా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన సత్యేంద్రనాథ్‌ బోస్‌కు జె సి బోస్‌, పి సి రారులు చక్కటి మార్గనిర్దేశం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా (1952 - 60) సేవలందించిన సత్యేంద్రనాథ్‌ బోస్‌ పేరున బోస్‌ గ్యాస్‌, బోసాన్‌, ఐడియల్‌ బోస్‌, ఫోటాన్‌ గ్యాస్‌, ఈక్వేషన్‌ ఆఫ్‌ స్టేట్‌, బోస్‌-ఐన్‌స్టీన్‌ కొర్రిలేషన్‌, బోస్‌-ఐన్‌స్టీన్‌ డిస్ట్రిబ్యూషన్‌ లాంటి ఆవిష్కరణలు నిలిచాయి. వైజ్ఞానికశాస్త్రంలో ఫిజిక్స్‌, మాథ్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మినరాలజీ, ఫిలాసఫీ, ఆర్ట్స్‌ మరియు సంగీత అంశాలలో పట్టు ఉన్న సత్యేంద్రనాథ్‌ అధ్యాపకుడిగా సేవలు అందించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన వ్యాసంలో సత్యేంద్రనాథ్‌ బోస్‌ను 'ఫాదర్‌ ఆఫ్‌ గాడ్‌ పార్టికిల్‌'గా అభివర్ణించారు. 20వ శతాబ్దంలో ప్రఖ్యాత 10 ఆవిష్కరణల్లో బోస్‌ ప్రతిపాదనలు కూడా చోటు దక్కించుకున్నాయి.

అసిమా చటర్జీ:
భారతీయ కర్బనరసాయన శాస్త్రజ్ఞులలో కలకత్తాకు చెందిన అసిమా చటర్జీ (23 సెప్టెంబర్‌ 1917 - 22 నవంబర్‌ 2006) ముందు వరుసలో నిలుస్తారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫైటో కెమిస్ట్రీ, అల్కలాయిడ్స్‌, ఔషధ మొక్కలు, యాంటీ-ఎలెప్టిక్‌ , యాంటీ-మలేరియల్‌ డ్రగ్స్‌ రంగాలలో విస్తత కషి చేశారు. భారతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందిన ప్రథమ మహిళగా అసిమా చటర్జీ నిలిచారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య పూర్తి చేసిన అధ్యాపకురాలిగా కూడా సేవలందించారు. తన పరిశోధనల్లో ముఖ్యమైనవిగా సర్పాజిన్‌, ఇండోల్‌ ఆల్కలాయిడ్స్‌, క్వినోలిన్స్‌, బీటా-ఫినైల్‌ఇథనాల్‌అమైన్స్‌, కుమరిన్స్‌ అంశాలు నిలిచాయి. తన పరిశోధనా ఫలితాలు 400 వ్యాసాల రూపంలో ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. శాంతి స్వరూప్‌ భట్నాగర్‌, పద్మభూషణ్‌, సి. వి. రామన్‌, యస్‌. యస్‌. భట్నాగర్‌ ఆవార్డులు లాంటివి అనేక పొంది, రాజ్యసభ (1982 - 1990) సభ్యురాలిగా కూడా పని చేశారు.
 

ఇ కె జానకీ అమ్మాల్‌ :
ప్రఖ్యాత భారతీయ వక్షశాస్త్ర పరిశోధకురాలైన ఇదవలత్‌ కక్కట్‌ జానకీ అమ్మాల్‌ (04 నవంబర్‌ 1897 - 07 ఫిబ్రవరి 1984) మద్రాస్‌ యూనివర్సిటీ ఉన్నత విద్య నభ్యసించి, మిచిగాన్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ పొందారు. అమెరికాలో పరిశోధనలు చేసి పిహెచ్‌డి పట్టా పొందిన ప్రథమ భారతీయ మహిళగా చరిత్రలో నిలవడంతో పాటు మిచిగన్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ (డి యస్‌సి) పొందిన భారతీయ మహిళగా పేరొందారు. వక్షశాస్త్రంలోని సైటోజెనెటిక్స్‌, ఫైటోజియోగ్రఫీ, ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగాల్లో లోతైన పరిశోధనలు చేశారు. చెరుకు, వంకాయ మొక్కలపై విశేష కషి చేశారు. సి. డి. డార్లింగ్‌టన్‌తో కలిసి 'క్రోమోసోమ్‌ అట్లాస్‌ ఆఫ్‌ కల్టివేటెడ్‌ ప్లాంట్స్‌' అనే చక్కటి పుస్తకం రచించారు. కేరళ అడవుల్లోని ఔషధ మ్నెక్కలు, ఎత్నోబోటనీలపై పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారాన్ని (1977) పొందారు. భారతదేశానికి చెందిన రెండు నూతన గులాబీ జాతులకు జానకీ అమ్మాల్‌ పేరు పెట్టారు. ఇదీ ఆమె విశిష్టత.


భారతీయ సంస్కతి, వారసత్వాలను తరతరాలకు అందజేసే బృహత్‌ కార్యాలను భుజాన వేసుకొని మోస్తున్న మేధావులు అన్ని రంగాలలో అనేకులు ఉన్నారు. శతాబ్ద క్రితం కూడా మహిళలు తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ మేధావుల మన్ననలు పొందగలిగారు. ఇలాంటి ఆదర్శమూర్తుల జీవితాలు, వారు సాధించిన విజయాలు, పరిశోధనా ఫలితాలు మానవాళికి ఎంతో ప్రయోజనకరంగా నిలిచాయి.
ఈ వైతాళికుల స్పూర్తితో వైజ్ఞానికశాస్త్రాల్లో భారత్‌ ముందుకు సాగుతుందని ఆశిద్దాం.
                                    * డా.బుర్ర మ‌ధుసూద‌న్‌రెడ్డి, (విశ్రాంత ప్రధానాచార్యులు, కరీంనగర్‌), మొబైల్‌ నెం- 9949700037