డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి
ప్రజాశక్తి - వన్‌టౌన్ : భారత యువశక్తి అమోఘమైన ప్రగతిని సాధిస్తుందని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్, కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు డాక్టర్ జీ సతీష్‌రెడ్డి అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల, కలామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్‌లెన్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 'భారతదేశ స్వావలంభన, దేశ యువత పాత్ర' అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. డాక్టర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత మేథోసంపత్తి భారతీయుల సొంతమన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన యువతలో 40 శాతం భారతీయులే ఉండనున్నారన్నారు. అబ్దుల్‌కలామ్ బాధ్యతలు చేపట్టిన సమయానికి ఒక్క క్షిపణిని కూడా స్వంతంగా తయారుచేసినదిలేదన్నారు. కానీ కలామ్ నేతత్వంలో ఒకే సారి ఐదు క్షిపణిలను సొంతంగా రూపొందించటమే కాకుండా అంతరిక్షంలో ప్రయోగించి భారతీయుల సత్తాను చాటిచెప్పారన్నారు. ప్రపంచంలో అత్యధిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆరేడు దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందన్నారు. కానీ కలామ్ ఆశయం భారతదేశమే అగ్రగామిగా ఉండాలని భావించారన్నారు. అది త్వరలోనే నెరవేరనుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఏ సంస్థ విజయం సాధించినా అందులో భారతీయుల పాత్ర లేకుండా లేదన్నారు. యువత రానున్న కాలంలో మరిన్ని అద్భుతాలు సాధించనున్నారని వివరించారు. అనంతరం విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు నరేష్ ఇండియన్ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పీఎల్ రమేష్, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ జీ కష్ణవేణి తదితరులు ప్రసంగించారు.










