Sep 16,2021 06:50

మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాలపై   సీతారాం ఏచూరి ఇంటర్వ్యూ
-  2వ భాగం

నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలో ఆదాయం, సంపద బాగా పెరిగిందని నమ్ముతున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అభివృద్ధికి రెండో పార్శ్వం - అంటే శ్రామిక ప్రజల దారిద్య్రం పెరిగిపోవడం వంటివి- సంగతేమిటి?

నయా ఉదారవాద విధానాల అమలు పర్యవసానంగా ఆర్థిక అసమానతలు చాలా రెట్లు పెరిగిపోయాయి. 'మెరిసిపోతున్న భారతం' ఎప్పుడూ 'చితికిపోతున్న భారతం' భుజాల పైన స్వారీ చేస్తూనే వుంది. మెరుస్తున్న భారతం తన మెరుపును ఎంత ఎక్కువగా పెంచుకుంటూ పోతోందో అంతే వేగంగా చితికిపోతున్న భారతం క్షీణించిపోతోంది.

మార్చి 2020 నుంచి ఇప్పటి వరకూ గడిచిన కాలంలో భారతదేశం లోని 100 మంది అతి పెద్ద శత కోటీశ్వరులు తమ సంపద విలువను రూ. 12,97,822 కోట్ల మేరకు పెంచుకున్నారు. మన దేశంలో ఉన్న 13 కోట్ల 80 లక్షల నిరుపేదలలో తలా ఒక్కరికీ ఈ మొత్తాన్ని గనుక పంచితే ఒక్కొక్కరికీ రూ.94,045 చొప్పున అందుతుంది.

ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో ముకేశ్‌ అంబానీ ఒక గంటలో సంపాదించిన మొత్తాన్ని గనుక ఒక అసంఘటిత కార్మికుడు సంపాదించాలంటే అతగాడికి 10,000 సంవత్సరాలు పడుతుంది. ముకేశ్‌ అంబానీ ఒక్క సెకనులో సంపాదించిన సంపదను గనుక సంపాదించాలంటే ఆ అసంఘటిత కార్మికుడికి మూడేళ్ళు పడుతుంది. ''అసమానతల వైరస్‌'' అనే పేర ఆక్స్‌ఫాం విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

2020 ఏప్రిల్‌లో ప్రతీ గంటకూ 1,70,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అదే లాక్‌డౌన్‌ కాలంలో మన శత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009తో పోల్చితే వారి సంపద 90 శాతం పెరిగింది. అంటే 42,290 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది (రూ.32 లక్షల కోట్లు సుమారుగా). అత్యంత సంపన్నులైన 11 మంది శత కోటీశ్వరులకు పెరిగిన సంపదతో 10 సంవత్సరాలపాటు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నడపవచ్చు. లేదా 10 సంవత్సరాల వైద్య, ఆరోగ్య బడ్జెట్‌ను భరించవచ్చు.

అత్యంత సంపన్నులైన 20 శాతం జనాభాలో 93.4 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించగలుగుతున్నారు. అదే అత్యంత పేదలుగా ఉన్న దిగువ 20 శాతం జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఈ సదుపాయాన్ని కలిగివున్నారు. మన దేశ జనాభాలో 59.6 శాతం కేవలం ఒక్క గదిలో గాని, లేదా అంతకన్నా తక్కువ జాగాలో గాని బతుకుతున్నారు.

ఒక ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో అది ప్రజారోగ్యానికి చేసే ఖర్చును పోల్చి చూస్తే భారతదేశం ప్రజారోగ్యానికి అతి తక్కువ ఖర్చు చేస్తున్న దేశాలలో దిగువ నుండి నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలోని అత్యంత సంపన్నులైన 11 మంది ఈ మహమ్మారి కాలంలో సంపాదించిన సంపదపై కేవలం ఒక్క శాతం పన్ను విధించితే వచ్చే మొత్తంతో జన్‌ ఔషధి స్కీమ్‌ బడ్జెట్‌ను 140 రెట్లు పెంచవచ్చు. పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ సరిపడా ఔషధాలను ఉచితంగా అందించవచ్చు.

ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం విస్మరించి కేవలం లాభాలను పెంచుకోవడంపైనే నయా ఉదారవాద సంస్కరణలు కేంద్రీకరించినందు వలన ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధాని మోడీ 'సంపద సృష్టికర్తలను' గౌరవించడం అలవర్చుకోవాలని మనకు చెప్తున్నారు. సంపద అంటే శ్రమజీవులు సృష్టించే సంపద యొక్క డబ్బు రూపం మాత్రమే. మనం గౌరవించాల్సింది మన దేశంలో యావత్తు సంపదనూ సృష్టించే ఈ శ్రమజీవులనే (అంతే తప్ప మోడీ చెప్పినట్టు కార్పొరేట్లను కాదు).

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండీ అనుసరించిన ప్రణాళికా విధానాన్ని మోడీ వచ్చాక విడిచిపెట్టారు. ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేశారు. అంతేకాదు. దానితోబాటు, అప్పటి నుంచీ మన దేశంలో పేదరికాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించిన ప్రమాణాన్ని-అంటే కనీస స్థాయి పౌష్టికాహార లభ్యత ప్రమాణాన్ని కూడా విడిచిపెట్టేశారు. ఆ ప్రమాణాల ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతంలో తలసరి 2200 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం ప్రతీ రోజూ పొందగలిగి ఉండాలి. అదే పట్టణ ప్రాంతాలకైతే 2100 క్యాలరీలు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం ప్రజలకు, పట్టణ ప్రాంతాల్లో 57 శాతం ప్రజలకు ఈ కనీస స్థాయి శక్తినిచ్చే ఆహారం లభించడం లేదు. ఇది 1993-94 నాటి పరిస్థితి. మళ్ళీ 2011-12లో సర్వే జరిపారు.

అప్పుడు 68 శాతం గ్రామీణ ప్రజలకు, 65 శాతం పట్టణ ప్రజలకు కనీస స్థాయి ఆహారం లభించడం లేదని తేలింది. ఆ తర్వాత తిరిగి 2017-18లో సర్వే జరిపారు. ఆ సర్వేలో వెల్లడైన వాస్తవాలు వెల్లడి కానీయకుండా మోడీ ప్రభుత్వం సర్వే వివరాలను తొక్కిపట్టింది. ఆ విధంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మన గణాంక వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఐతే ఆ సర్వే తేల్చిన గణాంకాలు కొన్ని బైటకు పొక్కాయి. ఆ వివరాల ప్రకారం మన గ్రామీణ ప్రాంతంలో (2011-18 మధ్య కాలంలో) ప్రజల తలసరి వినిమయం (ఆహార వస్తువులతో సహా) ఏకంగా 9 శాతం తగ్గిపోయింది. అంటే ప్రస్తుత మహమ్మారి రాకమునుపే మన దేశంలో అటు గ్రామాల్లో గాని, ఇటు పట్టణాల్లో గాని పేదరికం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ వేగంగా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా మరింత దిగజారింది.

ప్రపంచ ఆకలి సూచిక భారత దేశాన్ని ''సీరియస్‌ కేటగరీ'' (సమస్య తీవ్రంగా ఉన్న దేశాల జాబితా) దేశాల జాబితాలో చేర్చింది. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పోషకాహార లేమి పెరిగినట్టు, ముఖ్యంగా చిన్నపిల్లలలో బాగా పెరిగినట్టు, శిశు మరణాల రేటు పెరిగినట్టు, ఇతర ఆరోగ్య సూచికలలో కూడా దిగజారినట్టు సూచిస్తోంది. నిలకడైన అభివృద్ధి లక్ష్యాల సాధన సూచికలో మన దేశం మరో రెండు ర్యాంకులు దిగజారింది. 'ప్యూ' పరిశోధనా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 6 కోట్ల నుండి 13.4 కోట్లకు పెరిగింది. ప్రపంచ పేద ప్రజల సంఖ్య పెరిగినదానిలో ఒక్క మన దేశం నుండే 57.3 శాతం అదనంగా తోడయ్యారు. దేశంలోని మధ్యతరగతి ప్రజానీకంలో 59.3 శాతం పేదరికం లోకి దిగజారారు.

/ తదుపరి భాగం రేపు /