Nov 23,2020 21:12

భద్రతను పర్యవేక్షిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, తిరుమల
తిరుమల శ్రీవారి దర్శనార్ధం భారత ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు వైమానికి దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు 9 గంటలకే విజయవాడ గన్నవరం నుంచి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రానున్నారు. రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. అక్కడనుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, మధ్యాహ్నం 12.15కు తిరుమలకు చేరుకుంటారు. 12.50 గంటలకు క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకుని, మహాద్వార ప్రవేశ మార్గంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి 3.50 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. రాష్ట్రపటి పర్యటనను విజయవంతం చేసేందుకు టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈవో కెఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, అర్బన్‌ ఎస్‌పి రమేష్‌రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాన్వరు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రపతి పాల్గొనే ప్రతిచోట క్షుణ్ణంగాపరిశీలించారు. కలెక్టర్‌ సహా అధికార యంత్రాంగమంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్‌ 19 పరిస్థితుల దృష్టా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.