Dec 15,2022 23:01

పని ఒత్తిడితో విఆర్‌ఒలు సతమతం - రీసర్వే వ్యయం కూడా వారిదే - అదనపు పనులతో మానసిక ఒత్తిడి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

పని ఒత్తిడితో రెవెన్యూ శాఖలో విఆర్‌ఒలు సతమతమవుతున్నారు. ఏ ఒక్క విఆర్‌ఒను కదిలించినా ఒక్కొక్కరు ఒక్కో గాధ ప్రస్తావిస్తున్నారు. విఆర్‌ఒలకు వంద రోజుల్లో రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యాలను నిర్దేశించడంతో మరింత సతమతమవుతున్నారు. దానికితోడు ఈ రీసర్వేకు సంబంధించిన వ్యయమంతా వారే పెట్టుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. గ్రామస్థాయిలో విధులు నిర్వహించే విఆర్‌ఒలకు ఇటీవల పనిభారం అధికమైంది. ఎప్పుడు ఏ బాధ్యత మీద పడుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. పనిభారం తగ్గించాలంటూ చివరకు విఆర్‌ఒలు నిరసనకు దిగే దుస్థితి ఏర్పడింది. విధులతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. మండల స్థాయి నుంచి, జిల్లా అధికారుల వరకూ వినతిపత్రాలను సమర్పిస్తూనే ఉన్నారు. రాష్ట్రస్థాయిలోనూ సమస్యలు చెప్పుకున్నా ఫలితం దక్కడం లేదు. ఫలితంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విఆర్‌ఒలు నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారుల్లో చలనం లేదు. ప్రభుత్వం ఆదేశించే విధులను గంటల వ్యవధిలోనే పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. సచివాలయాలు ఏర్పాటైనా గ్రామస్థాయిలో ఉండే విఆర్‌ఒలకు తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా వెబ్‌ల్యాండ్‌ సమస్యలు పరిష్కరించాల్సి వస్తోంది. దానికోసం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలి. పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయాలంటే గతంలో నెలన్నర రోజుల వ్యవధి ఉండేది. ఇప్పుడది 21 రోజులకు కుదించారు. అప్పటిలోగా పట్టాదారు పుస్తకం మంజూరు చేయకపోతే విఆర్‌ఒలనే బాధ్యులను చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తేనే పట్టాదారు పుస్తకం మంజూరవుతోంది.
వ్యయమంతా వీరిపైనే..
జగనన్న భూరక్ష పథకంలో గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తోంది. అందుకోసం ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని నియమిస్తున్నారు. వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించే బాధ్యత విఆర్‌ఒలపై పడుతోంది. మరోవైపు రీ సర్వేకు అయ్యే వ్యయాన్ని వారే భరిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేకు గరిష్ఠంగా రూ.50 వేల వరకూ సొంత సొమ్ములు వెచ్చించారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహిస్తే మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. రీ సర్వే నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేయాలన్న ఒత్తిడి అధికమవుతోంది. ప్రభుత్వంమాత్రం ఇప్పటి వరకూ పైసా బిల్లు మంజూరు చేయలేదు. అంతా రెవెన్యూ ఉద్యోగులే భరిస్తున్నారు. రీసర్వేలో భాగంగా సర్వేయర్లతో క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి వస్తోంది. ఒకవైపు పనిఒత్తిడి ఎదురవుతుంటే మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.
ధాన్యం కొనుగోలు బాధ్యతా వీరిదే..
ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఎన్నడూ లేని విధంగా విఆర్‌ఒలను కస్టోడియన్‌లుగా నియమించింది. రైస్‌ మిల్లుల వద్ద కస్టోడియన్‌ ఆఫీసర్‌ బాధ్యతలను వారు నిర్వహిస్తున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. తేమ శాతంలో తేడా ఉంటోంది. రైతు భరోసా కేంద్రాలకు, రైస్‌ మిల్లుల వద్ద తేమ శాతానికి పొంతన కుదరడం లేదు. దాంతో విఆర్‌ఒలే కస్టోడియన్‌లుగా సమస్యను పరిష్కరించాల్సి వస్తోంది. నిత్యం కొనుగోలు బాధ్యతను నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తప్పులు జరిగితే కస్టోడియన్‌ ఆఫీసర్లను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలతో విఆర్‌ఒలు బెంబేలెత్తిపోతున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధం లేని బాధ్యతలు ఇప్పుడు విఆర్‌ఒలు నిర్వహించాల్సి వస్తోంది. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇకెవైసి నిర్వహించడంలో విఆర్‌ఒలే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కొంతకాలంపాటు దీనిలోనే నిమగమయ్యారు. అంతలోనే లబ్ధిదారులు ఇళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలొస్తున్నాయి. ఆ బాధ్యత కూడా వారిపైనే పడుతోంది. వ్యవసాయ గణాంకాల విధులను నిర్వహిస్తున్నారు. ఇ-క్రాప్‌ నమోదుతో పాటు, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి గణంకాలు సిద్ధం చేయాల్సి వస్తోంది. ఇలాంటి బాధ్యతలతో పాటు ప్రతినిత్యం నిర్వహించాల్సిన విధులు అనేకం ఉంటున్నాయి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఒబిసి, ఇడబ్ల్యూఎస్‌, ఎఫ్‌ఎంసి, వ్యవసాయ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. వీటికితోడు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే క్షేత్రస్థాయిలో బాధ్యతంతా వారిపైనే పడుతోంది. జాతర సమయాల్లో దేవాలయాల వద్ద విఆర్‌ఒలను నియమిస్తున్నారు. దీనికితోడు ప్రతీ సోమ, గురువారాల్లో సమావేశాలు ఉంటున్నాయి. ఎన్నికల విధులు తప్పడం లేదు. స్పందనలో సెల్ఫీ ఫొటో తప్పనిసరి చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే పరిరక్షించే బాధ్యత కూడా వీరిదే. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కకు మిక్కిలి విధులతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రస్థాయి అధికారులకు సైతం సమస్యలు చెప్పుకున్నా పరిష్కారం లభించడం లేదు.