Aug 12,2023 00:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న వారిపై దాడులు చేసి పెద్ద ఎత్తున నిల్వలను విజిలెన్సు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. బొల్లాపల్లి మండలం సరికొండవారిపాలెం చుట్టుపక్కల గ్రామాల నుండి లారీల్లో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో దాడి 77 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ కిన్నెర దేవయ్యను ప్రశ్నించగా ఎమ్‌డియు ఆపరేటర్‌ బాపతు వెంకటేశ్వరరెడ్డి గుమ్మనంపాడు డీలర్‌ మరియదాస్‌ కలసి వీటిని దారిమళ్లించినట్లు నిర్ధారణకు వచ్చారు. కొంతసేపటికి మరో వాహనంలో తనిఖీ చేయగా 60 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. డ్రైవర్‌ శివనాగరాజును ప్రశ్నించగా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన ఆదినారాయణ తన వాహనంఃలో లోడ్‌ చేసినట్లు అంగీకరించారు. వెల్లటూరులోని కజ్జాయం రామారావు ఇంట్లో తనిఖీ చేసి 22.5 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. రామారావును విచారించగా చుట్టు పక్కల గ్రామాల్లోని కార్డుదారుల నుండి వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలోని అంకమ్మరావు నుండి మరో 35 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్సు తహసీల్దార్‌ నాగమల్లేశ్వరరావు, సిఐ ఎస్‌.శ్రీనివాసులురెడ్డి, సబ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి మండలం పెదవడ్లపూడి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెనాలి నుంచి తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురానికి వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. 420 బస్తాల్లో తరలిస్తున్న బియ్యాన్ని సీజ్‌ చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు.