Jul 23,2023 21:57

నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం మధ్యలో నిలిచిపోయిన ఇంటి నిర్మాణం

పార్వతీపురంటౌన్‌: కొన్ని రోజుల ముందుగా భవన నిర్మాణాలకు అవసరమయ్యే పునాది రాయి, ఇసుక, 20 ఎంఎం సైజ్‌ పిక్క రాయి, 40 ఎంఎం సైజ్‌ రాయిని అమ్మకాలు చేసే సంబంధిత యజమానులు మెటీరియల్‌ రేట్లు ఒకేసారి పెద్దమొత్తంలో పెంచేశారు. దీంతో భవన నిర్మాణదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ రేట్లు పెంపుతో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణ పనులను నిలిపివేశారు. నిర్మాణ పనులు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక ఖాళీగా ఉంటూ తమ కుటుంబాన్ని పెంచుకునేందుకు అవకాశం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోడ్డునపడ్డారు. మెటీరియల్‌ రవాణా చార్జీతో కలిపి భవన నిర్మాణ సామాగ్రి గతంలో తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఇలా రెట్లు పెరగడానికి కారణం కేవలం మైనింగు యజమానులేనని భవన నిర్మాణ కార్మికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.4వేలు ఉంటే ప్రస్తుతం రూ.5వేలకు పెరిగింది. పునాదురాయి ట్రాక్టర్‌ లోడు రూ.2,700 ఉండగా, ప్రస్తుతం రూ.3,500 పెరిగింది. అలాగే 20 ఎంఎం పిక్క యూనిట్‌ గతంలో రూ.4,500 ఉండగా, ప్రస్తుతం రూ.5,500 ఉంది. 40ఎంఎం పిక్కరాయి ట్రాక్టర్‌ లోడు రూ.3,600 కాగా, ఇప్పుడు రూ.4,500కు పెరిగింది. ఇలా అయితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేరేలా లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా భవన నిర్మాణ మెటీరియల్‌ ధరలు పెంచుకుంటూ పోతే సంబంధిత మైనింగ్‌ అధికారులు చోద్యం చూడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.