
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: నర్సీపట్నం అబీద్ సెంటర్ నుండి పెద్ద బొడ్డేపల్లి వరకు రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో షాపు యజమానులు, వ్యాపారస్తులతో రెండవ అవగాహన కార్యక్రమాన్ని తాత్కాలిక చైర్మన్ తమరాన నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, మునిసిపల్ అధికారుల మధ్య తగాదా నెలకొంది. భవనాలు కోల్పోతున్నామని, దీంతో కొన్ని కోట్లు రూపాయలు నష్ట పోతున్నామంటూ యజమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
కమిషనర్ కనకారావు మాట్లాడుతూ, కౌన్సిల్ ఆమోదంతోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని 2022 ఫిబ్రవరిలోనే ఆమోదం తెలపడం జరిగిందన్నారు. మునిసిపాలిటీ అండర్ సెక్షన్ 266 ప్రకారం రోడ్డు విస్తరణలో భాగంగా మార్కింగ్ చేసినంత వరకు పనులు చేపడతామని ఆయన వివరించారు. ప్రభుత్వ జీవోలు, కౌన్సిల్ తీర్మానం ప్రకారం పని చేస్తుంది తప్ప ఎటువంటి ప్రలోభాలు లేవని వివరించారు. రోడ్డు విస్తరణలో మార్కింగ్ వరకు తొలగించడానికి మున్సిపాలిటీకి అధికారం ఉందని ప్రభుత్వ జీవో ప్రకారంగానే తొలగిస్తున్నామని కోల్పోయిన షాపు యజమానులకు టిడిఆర్ బాండ్లు ఇస్తామన్నారు. తుది ఉత్తర్వుల లోగా షాపులు ఖాళీ చేయాలని రిజిస్ట్రేషన్ చేయించిన యెడల లేదా ఖాళీ చేయకుండా ఉన్నట్లయితే మునిసిపాలిటీ తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఆ నేపథ్యంలో ఖర్చులు యజమానులే భరించాల్సి ఉంటుందని తెలియజేశారు. చట్టం ప్రకారమే జరుగుతుందన్నారు.
దీంతో వ్యాపారస్తులు కలుగజేసుకుని అంతా చట్టం ప్రకారమే జరిగినప్పుడు పట్టణంలో అపారి శుధ్యం ఎందుకు తాండవిస్తుందని ప్రశ్నించారు. ప్రజలు అపరిశుధ్యంతో నానా ఇబ్బందులు పడుతుంటే పారిశుధ్యం మెరుగు పరిచేందుకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఓట్లేసి గెలిపించుకున్నందుకు తమకు ఎవరు ఏ నాయకులు అండగా ఉండడం లేదని ఏకపక్షంగా తీర్మానం చేసి తొలగించేందుకు సిద్ధపడటం ఏంటని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
చైర్మన్ నాయుడు మాట్లాడుతూ, సుమారు 70 వేల జనాభా ఉన్న పట్టణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిత్యం డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంకు అనేకమంది అనేక మండలాల నుండి ప్రజలు వస్తున్నారన్నారు. ఈ తరుణంలో ట్రాఫిక్కు ఇబ్బందులు పడటం చూసి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద విన్నవించుకోగా రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాప పనులకు చేయడం జరిగిందని నాయుడు తెలిపారు.2018 లో ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం గానే రోడ్డు పనులు చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు.
రామ ఐరన్ షాప్ యజమాని పెదబాబు మాట్లాడుతూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మునిసిపల్ అధికారులు ఉన్నట్లయితే పట్టణం అంతా అభివద్ధి చెందే విధంగా చేయాలన్నారు. అన్ని రోడ్లు విస్తరణ చేయాలన్నారు. దీనికి కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లిదొర మాట్లాడుతూ, ఒక పని ప్రారంభించినప్పుడు మిగతావి జరుగుతాయని తెలిపారు. ప్రారంభంలోనే అడ్డు తగులుకోవడం మంచిది కాదని ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా రోడ్డు విస్తరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దీనికి వ్యాపారస్తులు వెలగ నారాయణరావు మాట్లాడుతూ, 80 అడుగులు రోడ్లు విస్తరణలు చేసినట్లయితే తమకు ఎటువంటి టీడీఆర్ బాండ్లు, నష్టపరిహారం చెల్లించ వలసిన అవసరం లేదని తెలిపారు. 100 అడుగులు రోడ్డు విస్తరణ చేసినట్లయితే తమకు ఆత్మహత్య శరణ్యం అని చనిపోయే ముందు ఆఖరి కోరిక ఎవరైనా తీరుస్తారని ఆ కోరిక పాలకులు మున్సిపల్ అధికారులు తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేసిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధి చేయండని రోడ్లు విస్తరణ చేసేందుకు తాము అనుకూలమేనని మా షాపులు పోతున్న తరుణంలో కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నామన్నారు. దీనిలో భాగంగా తమకు నష్టపరిహారాన్ని సంబంధిత ఖరీదు ప్రకారం చెల్లించాలన్నారు. సమావేశం ముగిసిన తర్వాత వ్యాపారస్తులు. భవన యజమానులు కార్యాలయం నుండి బయటకు వచ్చి టిడిఆర్ బాండ్లు వద్దు నష్టపరిహారం ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు.