ప్రజాశక్తి - మాచర్ల : విజిలెన్స్ సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో పట్టణంలోని సిగరెట్ హోల్‌సేల్ వ్యాపారుల షాపులు, గోదాముల్లో అధికారులు మంగళశారం తనిఖీలు చేపట్టారు. పెద్ద మొత్తంలో నకిలీ సిగరెట్ల స్టాకులు పట్టుబడ్డాయి. నరసరావుపేట డివిజన్ పరిధిలోని ఐటిసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ శివరామయ్య మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో కొంతమంది వ్యాపారులు నకిలీ సిగరెట్లను తెచ్చి విక్రయించి లాభాలు పొందుతున్నారని అన్నారు. వీటిని తాగడం వలన ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజల ప్రాణాలతో వారు చెలగాటమాడుతున్నారని చెప్పారు. గతంలో చిలకలూరిపేటలోనూ తనిఖీలు చేసి నిల్వలను పట్టుకున్నామన్నారు. తాజా తనిఖీల్లో నలుగురు వ్యాపారుల షాపులు, గోదాముల్లో రూ.7 లక్షల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.










