ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. డ్రైన్‌లలో నీరు పారుదల కాక రోడ్లపైకి చేరింది. మండల పరిధిలో సాగు చేసిన మునగతోటలు వాలి కాయలు రాలిపోవడమే కాకుండా మునగకాయలకు మంగు సోకినట్లు రైతులు వాపోయారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడవకుండా రైతులు హడావుడిగా పట్టాలు కప్పారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ ప్రజాప్రతినిధి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ కటౌట్ ఈదురుగాలులకు పడిపోయింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కంచికచర్లలో డ్రైన్‌లలో నీరు పారుదల కాక నెహ్రూ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహించింది. ప్రజాశక్తి-వత్సవాయి: కన్నెవీడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ వర్షంతో నిండిపోయింది. వర్షపు నీటితో విద్యార్థులు పలు ఇబ్బందులు గురయ్యారు. కంభంపాడు గ్రామంలో పిడుగుపాటుకు మహిళా కూలీ మృతిచెందింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నవరం గ్రామానికి చెందిన సైదమ్మ తెలంగాణ రాష్ట్రం నుండి మిరపకాయలు కోయటానికి వచ్చింది. రోజువారీగా మిరపకాయలు కోస్తుండగా ఒకసారి వాతావరణ చల్లబడి ఉరుములు మెరుపులతో వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో సైదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రజాశక్తి-తిరువూరు: ఈదురు గాలుల, ఉరుములు, మెరు పులతో వర్షం సష్టించిన బీభత్సానికి తిరువూరు మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి కాయలు నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు.










