Aug 23,2023 22:34

వర్షానికి జలమయమైన పట్టణంలోని ప్రధాన రహదారి

పార్వతీపురంటౌన్‌: జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు వీధుల రోడ్లతో పాటు ప్రధాన రహదారి జలమయమైంది. వరద నీటితో పాటు, రహదారికిరువైపులా మురుగు కాలువలో ఉన్న నీరు ప్రధాన రహదారిపైకి చేరి ప్రవహించడంతో చెరువును తలపించేలా ఉంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి అటు ఆర్‌ అండ్‌ బి అధికారులు కానీ, ఇటు మున్సిపల్‌ అధికారులు గానీ చర్యలు చేపట్టకపోవడం దారుణమని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమన్వయంతో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి కాలువల్లో పూడికలు తొలగించేందుకు చర్యలు చేపడితే గానీ ఈ సమస్య పరిష్కారం జరగదని పట్టణ ప్రజలు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేస్తారో లేదో చూడాలి మరి.